Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్( Phone tapping) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో ఏపీ నేతల ఫోన్లో కూడా ట్యాప్ చేసినట్లు తాజాగా సమాచారం అందుతోంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసునకు సంబంధించి ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగు కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఫోన్లను సైతం అప్పట్లో ట్యాపింగ్ చేసినట్లు తెలియడం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు కొత్త మలుపునకు దారి తీసినట్లు అయ్యింది. అప్పట్లో కెసిఆర్ తో జగన్మోహన్ రెడ్డికి ఉన్న స్నేహం కారణంగానే చంద్రబాబు, లోకేష్ ను అప్పటి తెలంగాణ సర్కార్ టార్గెట్ చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు
తెలంగాణలో( Telangana) కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఫోన్ ట్యాపింగు తెరపైకి వచ్చింది. అప్పట్లో కెసిఆర్ రాజకీయ ప్రత్యర్థులను వెంటాడారని.. అందులో కాంగ్రెస్ తో పాటు బిజెపి నేతలు బాధితులుగా మిగిలారన్న విమర్శలు ఉండేవి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరపగా ఏపీలో టిడిపి నేతల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి కొనుగోలు చేసిన ప్రత్యేక పరికరం ద్వారా వారి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు సమాచారం.
ఉమ్మడి శత్రువు చంద్రబాబు..
అప్పట్లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) అధికారంలో ఉండేవారు. తెలంగాణలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. వారిద్దరి ఉమ్మడి శత్రువు చంద్రబాబు. 2018లో తెలంగాణలో ఓడించేందుకు చంద్రబాబు ప్రయత్నించారని.. అందుకు రిటర్న్ గిఫ్ట్ తప్పదని హెచ్చరించారు కేసీఆర్. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పరోక్ష సహకారం అందించి మరింత దగ్గరయ్యారు. అప్పటినుంచి చంద్రబాబును రాజకీయంగా దెబ్బ కొట్టాలని భావించారు ఇద్దరు నేతలు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిందని.. చంద్రబాబుతో పాటు లోకేష్ ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు తాజాగా విచారణలో మాజీ ఓఎస్డి వెల్లడించినట్లు తెలుస్తోంది. కేవలం జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రయోజనం చేకూర్చాలన్న ఉద్దేశంతో అప్పట్లో ఆ పనికి పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం.
అన్ని పార్టీల్లో బాధితులు..
అయితే ఒక్క టీడీపీ నాయకులే కాదు. కెసిఆర్ కు( KCR) వ్యతిరేకంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రచారంలో ఉంది. విచారణలో కూడా ఇదే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ ఓఎస్డి వాంగ్మూలంతో మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ వుచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే తెలంగాణలో ఫోన్ ట్యాపింగు ప్రకంపనలు ఏపీకి కూడా తాకాయి. మరి ఎటువైపునకు దారితీస్తాయో చూడాలి.