Petrol Prices AP: దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ( Andhra Pradesh) ఆదాయపరంగా వెనుకబడి ఉంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు చూస్తోంది. అలాంటి రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉండడానికి కారణం ఏంటి? అన్నది మాత్రం తెలియడం లేదు. దేశవ్యాప్తంగా రాష్ట్రాలవారీగా పెట్రోల్ ధరలు మారుతూ ఉంటాయి. అయితే ఏ రాష్ట్రంలోనూ లేనంత అత్యధిక పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండడం రాష్ట్ర ప్రజల సమస్యగా మారింది. దేశంలోనే అత్యధిక ధర ఏపీలోనే ఉంది. అయితే ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత ధర ఉందో ఇప్పుడు చంద్రబాబు హయాంలో అంతే కొనసాగుతోంది. అయితే ఎందుకు ఈ పరిస్థితి అన్నది మాత్రం అంతు పట్టడం లేదు.
* తలసరి ఆదాయం తక్కువ..
దేశంలోనే తలసరి ఆదాయం తక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. 28 రాష్ట్రాల్లో 15 నుంచి 18 స్థానాల్లో కొనసాగుతోంది ఏపీ. అయితే పెట్రోల్ ధరల విషయంలో ఎక్సైజ్ డ్యూటీ( excise duty) ఉంటుంది. లీటర్ కు దాదాపు 20 రూపాయల వరకు ఉంటుంది. రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం VAT ను భారీగా పెంచుతున్నాయి. ఏపీ ప్రభుత్వం సైతం 31% VAT + లీటరుకు అదనపు VAT రూ. 4.. మరోవైపు లీటర్ కి ఒక రూపాయి రోడ్డు డెవలప్మెంట్ సెస్ విధిస్తోంది. రాష్ట్ర విభజన నాటి నుంచి ఇది ఇలానే స్థిరంగా కొనసాగుతోంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తుండడంతో దీనిలో మార్పు చేసేందుకు ఇష్టపడడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి సర్కార్ కానీ.. చంద్రబాబు సర్కార్ కానీ వీటిని తగ్గిస్తే రాష్ట్ర ఆదాయం పడిపోతుంది. అందుకే ఏపీలో పెట్రోల్ తో పాటు డీజిల్ ధర తగ్గడం లేదు.
* తగ్గిన ఎక్సైజ్ డ్యూటీ..
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ( central government)పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ పన్నును గణనీయంగా తగ్గించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుగా మారడంతో వ్యాట్ తగ్గించడం లేదు. పైగా ఏపీకి రిఫైనరీలు దూరంగా ఉన్నాయి. దీంతో లాజిస్టిక్స్ కాస్ట్లు కూడా ఎక్కువ. డీలర్ కమిషన్ 3.9% కూడా ధరల పెరుగుదలకు ఒక కారణం. దేశంలో అతి తక్కువ పెట్రోల్ ధర అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుంది. అక్కడ లీటర్ పెట్రోల్ కేవలం 82 రూపాయల మాత్రమే. కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో అక్కడ వ్యాట్ తక్కువ. ఈశాన్య రాష్ట్రాల్లో సైతం పెట్రోల్ ధర తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ పై వచ్చే ఆదాయంపై కాకుండా.. ప్రత్యామ్నాయ మార్గాలపై అక్కడ ప్రభుత్వాలు దృష్టి సారిస్తుంటాయి.
* అండమాన్ తో పోల్చుకుంటే..
అండమాన్ తో( Andaman Nicobar) పోల్చుకుంటే లీటర్ పెట్రోల్ ఏపీలో 27 రూపాయల వరకు ఎక్కువ. అయితే పెట్రోల్ డీజిల్ వినియోగం అనేది మనిషి దైనందిన జీవితంలో తప్పనిసరిగా మారింది. ప్రతి కుటుంబం పై భారం తప్పదు. అయితే ప్రభుత్వాలు మారుతున్న ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గకపోవడం పై అనేక రకాల విమర్శలు ఉన్నాయి. అయినా సరే ప్రజలు సర్దుకుపోతున్నారు. అయితే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పెట్రోల్ డీజిల్ ధరలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.