Jagan Padayatra: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) పాదయాత్ర చేస్తారా? ఆ విషయం మాజీ మంత్రి పేర్ని నాని చెప్పడం ఏంటి? స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారు కదా? ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. 8 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. దానిని గుర్తు చేస్తూ విజయోత్సవాలు జరుపుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే చాలామంది పెద్దగా పాటించలేదు. అయితే మాజీ మంత్రి పేరుని నాని మాత్రం ఆ వేడుకలను జరుపుకున్నారు. అంతటితో ఆగకుండా 2027 లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తారని ప్రకటించారు. అయితే పేర్ని నాని ప్రకటనతో అది ఎంతవరకు వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది. సాధారణంగా ఇటువంటి విషయాలన్నింటినీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటిస్తారు. ప్రత్యర్ధులను విమర్శ చేయడానికి మాత్రం పేర్ని నాని సేవలను వాడుకుంటారు. అందుకే ఇప్పుడు సందేహం.
* అప్పట్లో అలా..
జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి వైసీపీ ( YSR Congress party) నేతల నుంచి భిన్న వాదన వినిపిస్తోంది. మునుపటిలా వ్యవహారం లేదని వారే ఒప్పుకుంటున్నారు. 2017లో పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్ని అనుకూల శకునాలే ఉన్నాయి. అప్పటి టిడిపి ప్రభుత్వం పై చిన్నపాటి వ్యతిరేకత ప్రజల్లో ఉండేది. ఆపై కేంద్రంతో కూడా టిడిపి వ్యవహారం అనుమానంగా ఉండేది. ఆపై ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి విన్నపంపై ప్రజలు సానుకూలంగా ఉండేవారు. ఇవన్నీ కలిసి రావడంతో జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘకాలం పాదయాత్ర చేయగలిగారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేనే లేదన్నది ఎక్కువమంది అభిప్రాయం.
* చాలా రకాల ప్రతికూలతలు..
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం( Alliance government ) పట్ల సానుకూలత ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలన కంటే బాగుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం సైతం సహకారం అందిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమిలో లేదు. కాంగ్రెస్ పార్టీతో వైరం నడుస్తోంది. వామపక్షాలతో చెలిమి లేదు. సొంత పార్టీ నేతల నుంచి సహకారం లేదు. సీనియర్లు యాక్టివ్ కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేందుకు అనువైన వాతావరణం ఇప్పుడు లేదు. పైగా గత 17 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకు వచ్చింది చాలా తక్కువ. తాడేపల్లి లో మూడు రోజులపాటు గడుపుతున్న ఆయన ఎక్కువ రోజులు బెంగళూరులోనే ఉంటున్నారు.
* మునుపటి ఉత్సాహం ఏది?
మునుపటిలా ఉత్సాహం జగన్మోహన్ రెడ్డిలో లేదు. ఆపై ఐదేళ్లు పాలన కూడా చేశారు. అప్పట్లో అయితే అన్ని తాను చేస్తానని చెప్పుకొచ్చారు. ఏ జిల్లా సమస్యలు ఆ జిల్లాలో ప్రస్తావించేవారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నింటికి పరిమితం అయ్యారు. అందుకే ఇప్పుడు ప్రజల్లోకి వెళితే ఏం చెప్పాలో తెలియదు. ప్రజల నుంచి అనేక రకాలుగా ప్రశ్నలు వస్తాయి. ఆపై కూటమి ప్రభుత్వం 2017 మాదిరిగా సహకరిస్తుందన్న పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే లోకేష్ పాదయాత్ర సమయంలో ఎంత ఇబ్బంది పెట్టారో తెలియంది కాదు. ఇన్ని ప్రతికూలతల నడుమ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తారని ఎక్కువమంది నమ్మడం లేదు. ఆపై పేర్ని నాని లాంటి నేత చెప్పేసరికి రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.