Peddireddy Ramachandra Reddy: అధికారంలో ఉన్నప్పుడు అన్నీ కలిసి వస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేతల బలాలు తెలుస్తాయి. ఇప్పుడు సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి అదే. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఆయన రాయలసీమకు ముఖ్యమంత్రిగా వ్యవహరించేవారు. రాయలసీమ పరిధిలోని నాలుగు జిల్లాలు ఆయన కంట్రోల్లో ఉండేవి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ కావడం.. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు రామచంద్రారెడ్డి. చంద్రబాబుకు సమకాలీకుడు కావడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన చెంత ఉంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. 2014లో రాయలసీమలో వైసీపీ హవా నడిచింది. 2019లో క్లీన్ స్వీప్ చేసింది. అంతవరకు ఓకే కానీ.. 2024 ఎన్నికల్లో అదే రాయలసీమలో ఏడు స్థానాలకు పడిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. దీంతో అదంతా హవా తప్ప పెద్దిరెడ్డి లాంటి సీనియర్ల ప్రమేయం లేదన్న నిర్ధారణకు వస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.
* అంతా ఆయన కంట్రోల్ లోనే..
సొంత జిల్లా చిత్తూరులో( Chittoor district) పెద్దిరెడ్డి కంట్రోల్లో ఉండేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్కే రోజా లాంటి నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. పెద్దిరెడ్డి పెద్దరికాన్ని అయిష్టంగానే గౌరవించేవారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డితో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం. అయితే ఇప్పుడు మాత్రం సీన్ మారింది. ముఖ్యంగా నగిరి నియోజకవర్గ విషయంలో రోజా పట్టు బిగిస్తున్నారు. తన నియోజకవర్గంలో పెద్దిరెడ్డి మనుషుల పెత్తనాన్ని సహించుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయేది. కానీ ఇప్పుడు మాత్రం పెద్దిరెడ్డి ప్రమేయాన్ని ఎంత మాత్రం సహించడం లేదు. పెద్దిరెడ్డి మనుషులను పార్టీ నుంచి బయటకు పంపుతారా? లేకుంటే తానే వెళ్లిపోమంటారా అంటూ రోజా గట్టిగానే హెచ్చరించినట్లు ప్రచారం నడుస్తోంది.
* ఫుల్ సైలెన్స్..
ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( peddireddy Ramachandra Reddy) ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి తో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జగన్ వద్ద ప్రాధాన్యత లభిస్తున్నట్లు సమాచారం. చెవిరెడ్డి అరెస్టు జరిగిన తర్వాత ఏ నేతకు లేనంత ప్రాధాన్యత ఆయనకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అసలు జైలుకెళ్లిన పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని జగన్ కలుసుకునేందుకు కూడా ఇష్టపడలేదట. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి న్యాయ సహాయం అందిస్తున్నారట. ప్రస్తుతం భూమన కరుణాకర్ రెడ్డి సైతం చిత్తూరు జిల్లాలో యాక్టివ్ అయ్యారు. ఇప్పటివరకు ఒక లెక్క ఇకనుంచి ఒక లెక్క అన్నట్టు ఉంది వైసీపీ సీనియర్ల పరిస్థితి. పెద్దిరెడ్డి తమ నియోజకవర్గాల్లో వీలు పెట్టకూడదని చిత్తూరు వైసీపీ సీనియర్ నాయకుడు విజయానంద రెడ్డి సైతం తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్దిరెడ్డి పెద్దరికం అమాంతం పడిపోయినట్టు కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?