Pawankalyan : పవన్ పోటీచేసేది అక్కడే.. ఈసారి నో డౌట్

2019 ఎన్నికల్లో పవన్ గాజువాకతో పాటు భీమవరం నుంచి పోటీచేశారు. ఈ ఎన్నికల్లో రెండింట్లో ఒక చోట నుంచి పోటీ ఖాయమని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Written By: Dharma, Updated On : May 25, 2023 9:24 am
Follow us on

Pawankalyan : వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీచేసే స్థానాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతసారిలా రెండుచోట్ల పోటీచేస్తారా? లేకుంటే ఒకేచోట బరిలో దిగుతారా? దిగితే ఎక్కడి నుంచి దిగుతారు? అన్నదానిపై గత కొద్దిరోజులుగా అయితే చర్చ సాగుతోంది. పవన్ పోటీచేసేది అక్కడే అని పది స్థానాల వరకూ చూపుతూ సోషల్ మీడియా హోరెత్తిస్తోంది. కానీ జనసేన నుంచి ఎటువంటి స్పష్టత లేదు. పొత్తుల లెక్కలు తేలిన తరువాత పవన్ పోటీచేసే సీటుపై క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ, జనసేన పొత్తుకు సంబంధించి సానుకూల వాతావరణం ఉంది. ఆ రెండు పార్టీలు బీజేపీ కోసం చూస్తున్నాయి. అక్కడ నుంచి వచ్చే సంకేతాలు బట్టి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.

2019 ఎన్నికల్లో పవన్ గాజువాకతో పాటు భీమవరం నుంచి పోటీచేశారు. ఈ ఎన్నికల్లో రెండింట్లో ఒక చోట నుంచి పోటీ ఖాయమని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే భీమవరం నుంచి పోటీచేయాలని పవన్ పై ఒత్తిడి ఉంది. అటు టీడీపీ వర్గాలు సైతం ఆ స్థానాన్ని ఖాళీగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. గాజువాక విషయంలో పల్లా శ్రీనివాసరావు రూపంలో బలమైన అభ్యర్థి టీడీపీకి ఉన్నారు. అందుకే భీమవరం స్థానాన్ని టీడీపీ రిజర్వులో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అటు జనసేనకు గోదావరి జిల్లాలో మంచి గ్రాఫ్ ఉంది. సర్వే నివేదికలు కూడా తెలియజేస్తున్నాయి. పవన్ కానీ అక్కడ నుంచి బరిలో దిగితే ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు స్వీప్ చేసే అవకాశముందని తెలుస్తోంది.

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే మాత్రం ఏకపక్ష విజయం నమోదయ్యే అవకాశముందని వార్తలు వచ్చాయి. ఇక్కడ జనసేనతో పొత్తు టీడీపీకి లాభిస్తుందన్న అంచనా ఉంది. మెజార్టీ సర్వేలు సైతం దానినే తెలియజేస్తున్నాయి. ఇటీవల మంగళగిరి మీటింగులో సైతం పవన్  జనసేన గ్రాఫ్ గురించే మాట్లాడారు. గతం కంటే జనసేన బలం గణనీయంగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. అందుకే జనసేన ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఫోకస్ పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పవన్ పోటీచేయాలంటే చాలా నియోజకవర్గాలున్నాయి. అక్కడ పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాయి.  భీమవరం, గాజువాకలతో పాటు కాకినాడ రూరల్, పిఠాపురం, తిరుపతి, అనంతపురం  వంటి నియోజకవర్గాలు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే జనసేన పార్టీ శ్రేణులు మాత్రం పవన్ కు కొత్త సూచన చేస్తున్నాయి. చంద్రబాబుకు కుప్పం, జగన్ కు పులివెందుల మాదిరిగా ఒక స్థిర నియోజకవర్గం ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నాయి. అయితే పవన్ మదిలో ఏముందో తెలియడం లేదు. ఉభయగోదావరి జిల్లాలపై ప్రత్యేక మమకారం ఉంది. పోయిన చోటే వెతుక్కోవాలన్న భావన కనిపిస్తోంది. ఈ లెక్కన అయితే భీమవరం నుంచి మరోసారి బరిలో దిగడం పక్కగా కనిపిస్తోంది.