Homeఆంధ్రప్రదేశ్‌Nagababu: ఆఖరుకు బ్రదర్ నాగబాబుకు సీటు లేదా? పవన్ మార్చేశాడా?

Nagababu: ఆఖరుకు బ్రదర్ నాగబాబుకు సీటు లేదా? పవన్ మార్చేశాడా?

Nagababu: గత కొంతకాలంగా మెగా బ్రదర్ నాగబాబు జనసేన లో యాక్టివ్ గా పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నారని బలంగా ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే పవన్ అనకాపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో పర్యటనలు చేశారు. ఓ ఇంటిని అద్దెకు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఉన్నపలంగా నాగబాబు ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఇతరత్రా సామాగ్రిని సైతం తరలించినట్లు తెలుస్తోంది. దీంతో నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయడం లేదని ప్రచారం ఊపందుకుంది. గత కొద్దిరోజులుగా నాగబాబు ఆచూకీ లేకపోవడంతో.. తెర వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

జనసేనతో తెలుగుదేశం పొత్తు కుదిరింది. ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. 24 అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు పార్లమెంటు స్థానాలను జనసేనకు టిడిపి కేటాయించింది. అయితే పవన్ మాత్రం ఐదుగురు జనసేన అభ్యర్థులను ప్రకటించారు. 19 మందిని పెండింగ్ లో పెట్టారు. అటు లోక్సభ స్థానాలకు సంబంధించి అనకాపల్లి, మచిలీపట్నం,కాకినాడ స్థానాలు జనసేనకు కేటాయించినట్లు ప్రచారం జరిగింది. మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని ఇటీవల పార్టీలో చేరిన బాలశౌరికి, కాకినాడ టిక్కెట్ను సానా సతీష్ కు కేటాయించినట్లు తెలుస్తోంది. మరోవైపు అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచినాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.అందుకు తగ్గట్టుగానే నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఎలమంచిలి లో అద్దె ఇంటిని తీసుకున్నారు. 15 రోజుల కిందట గృహప్రవేశం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని టిడిపి జనసేన నాయకులతో సమన్వయం చేసుకున్నారు. అయితే ఉన్నట్టుండి నాగబాబు కనిపించకుండా పోయారు. ఎలమంచిలి లో అద్దె ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కూడా తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు నేపథ్యంలో రకరకాల వివాదాలు నడిచాయి. కొన్ని నియోజకవర్గాల విషయంలో గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనకాపల్లి సీటు విషయంలో సైతం టిడిపిలో అంతర్గతంగా విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. కీలకమైన అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని వదులుకోవడం టిడిపికి ఇష్టం లేదు. అయితే పవన్ కోరిక మేరకు నాగబాబుకు ఆ సీటును కేటాయించారు. చాలా సీట్ల విషయంలో చంద్రబాబు అభ్యంతరాల మేరకు పవన్ వదులుకుంటున్నారు. రాజమండ్రి రూరల్ విషయంలో కూడా ఇటువంటి వివాదమే నెలకొంది. అక్కడ టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. అదే సీటును జనసేన కీలక నేత కందుల దుర్గేష్ ఆశిస్తున్నారు. ఆయన పేరును జనసేన సమావేశంలో పవన్ ప్రకటించారు కూడా. అయితే బుచ్చయ్య చౌదరి పట్టుదలకు వెళ్లడంతో చంద్రబాబు పవన్ ను ఆశ్రయించారు. దీంతో దుర్గేష్ కు నిడదవోలు వెళ్లాలని పవన్ సూచించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా నాగబాబు విషయంలో సైతం ఇదే జరిగిందని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఒత్తిడి మేరకు పవన్ నాగబాబును తప్పించినట్లు తెలుస్తోంది. వేరే నియోజకవర్గానికి పంపించినట్లు టాక్ నడుస్తోంది.

అయితే జనసేన అభ్యర్థుల ఎంపిక, పవన్ తీసుకుంటున్న నిర్ణయాలపై పార్టీలో ఒక రకమైన చర్చ నడుస్తోంది. సీట్ల సర్దుబాటు ప్రక్రియ చంద్రబాబు కనుసనల్లో నడుస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. పొత్తులో భాగంగా వచ్చిందే తక్కువ సీట్లు అని.. అవి కూడాటిడిపి కోరిక మేరకు వదులుకుంటే ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జనసేనకు సంబంధించి కీలక నేతల్లో ఒక్క నాదెండ్ల మనోహర్ కి సీటు ఖరారు అయింది. అటు నాగబాబు సైతం అనకాపల్లిలో పోటీ చేస్తారని జన సైనికులు సంతోషించారు. కానీ టిడిపి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతోనే తప్పించారని ప్రచారం జరుగుతుండడంతో జనసేనలో గందరగోళం నెలకొంది. దీనిపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తరచూ అభ్యర్థుల మార్పుతో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధినేత తీరుపై వాపోతున్నారు. ఇలా అయితే ఓట్ల బదలాయింపు కూటమికి సక్రమంగా జరగదని తేల్చి చెబుతున్నారు. జనసేన సీట్లపై స్పష్టత ఉండాలని కోరుకుంటున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular