Pawan Kalyan visits Konaseema: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) బాధ్యతగా వ్యవహరిస్తారు. మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటారు. తాను కూటమిలో కీలక భాగస్వామి అని.. తన మాటే చెల్లుబాటు అవుతుందని ఎన్నడూ చెప్పరు. అయితే ఈ విషయంలో జనసైనికులు భిన్నంగా ఉంటారు. తమ నేత వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని మాట్లాడుతుంటారు. అయితే ఆ మాటలు కూటమికి ఇబ్బందికరం అని పవన్ కళ్యాణ్ కు తెలుసు. అందుకే అటువంటి వ్యాఖ్యలకు దూరంగా ఉంటారు పవన్ కళ్యాణ్. తాజాగా కోనసీమలో కొబ్బరి రైతుల సమస్యలను స్వయంగా పరిశీలించారు పవన్ కళ్యాణ్. అక్కడ ఉప్పు నీటితో కొబ్బరి పంటకు నష్టం జరుగుతుందని తెలిసి పరామర్శకు వెళ్లారు. ఇలా వెళ్లే క్రమంలో చాలా బాధ్యతగా మాట్లాడారు. తాను ఇప్పటికిప్పుడు సమస్యను పరిష్కరించే ముఖ్యమంత్రి హోదాలో లేనన్న విషయాన్ని గుర్తు చేసి.. సీఎం చంద్రబాబుతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటానని రైతులకు హామీ ఇచ్చారు.
పవన్ ఆవేదన అదే..
అయితే గత వైసిపి( YSR Congress party ) ప్రభుత్వ వైఫల్యాలు వ్యవస్థలను వెంటాడుతున్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదనతో ఉన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజలకు డబ్బులు ఇస్తే చాలదని.. వారు పడుతున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉందని అభిప్రాయపడ్డారు. తద్వారా గత ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలను అమలు చేసి పాలనను గాలికి వదిలేసిందని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. తద్వారా గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో వెంటనే తాను పరిష్కార మార్గం చూపించే ప్రయత్నం చేస్తానని అతిగా హామీ కూడా ఇవ్వలేదు.
అదే పనిగా వైసిపి ప్రచారం..
అయితే తాను సీఎం హోదాలో లేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. పవన్ కళ్యాణ్ సీఎం పదవి ఆశిస్తున్నారని ప్రచారం చేస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వం కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలను పట్టించుకోలేదన్నది పవన్ ఆవేదన. సీఎం చంద్రబాబుతో చర్చించి ఆ సమస్యకు పరిష్కారం మార్గం చూపుతానని చెప్పే క్రమంలో బాధ్యతగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలు మరిచి.. ఎంత మాత్రం తాను సీఎం పదవిలో లేనని చెప్పిన మాటను హైలెట్ చేస్తోంది. అయితే కూటమి మరో 15 సంవత్సరాల పాటు కొనసాగుతుందని పవన్ చెప్పిన మాటను ఆయన అక్షరాల పాటిస్తున్నారు. మొన్న ఆ మధ్యన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలకు సంబంధించిన ఫోటోలు కూడా తీశారు. ఇప్పుడు గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమించే క్రమంలో.. సీఎం చంద్రబాబుతో చర్చించి పరిష్కార మార్గం చూపుతామని చెప్పారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతతో మెలుగుతున్నారు.