Pawan Kalyan: పిఠాపురం( Pithapuram) నియోజకవర్గంలో పరిణామాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజకీయ, పాలన, అభివృద్ధి, శాంతి భద్రతలకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇంటలిజెన్స్ వర్గాల నుంచి నివేదికలు కూడా కోరారు. అదే సమయంలో కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా జనసేన ప్లీనరీలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా సీన్ మారింది. పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని భావించిన పవన్ దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం.
Also Read: పవన్ ఇలాకాలో దారుణం.. ఏంటీ రికార్డింగ్ డ్యాన్సులు
* నాగబాబు వ్యాఖ్యల కలకలం..
పిఠాపురం నియోజకవర్గం త్యాగం చేశారు వర్మ( TDP Varma). అప్పటివరకు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఇంతలోనే పవన్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో వర్మ అసంతృప్తికి గురయ్యారు. చంద్రబాబు చెప్పేసరికి పవన్ గెలుపు కోసం కృషి చేశారు. పవన్ నుంచి సైతం వర్మ కు సరైన గౌరవం దక్కేది. అయితే క్రమేపి వర్మను దూరం పెట్టారు పవన్. ఈ క్రమంలో జనసేన ప్లీనరీలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టాయి. తాజాగా నియోజకవర్గ పరిధిలో ఒక కార్యక్రమానికి వర్మను ఆహ్వానించకపోవడం పై టిడిపి శ్రేణులు మండిపడ్డాయి. జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ ను నిలదీసే వరకు పరిస్థితి వచ్చింది. ఈ పరిణామాల క్రమంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గం రాజకీయాలపై కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టారు. అసలేం జరుగుతోందని ఆర్ఆర్ తీసే పనిలో ఉన్నారు.
* శాంతి భద్రతలపై నివేదికలు
పిఠాపురం నియోజకవర్గంలో శాంతిభద్రతల( law and order ) విషయంలో జాగ్రత్తలు పడుతున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని కొందరు అలజడి సృష్టించే అవకాశం ఉంది. అందుకే పోలీస్ అధికారులను సైతం అప్రమత్తం చేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగం సైతం పిఠాపురం పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్లో పరిస్థితులపై ఇంటలిజెన్స్ నివేదిక తీసుకోవాలని పవన్ ఆదేశించినట్లు సమాచారం. అయితే ఒక్కసారిగా ఆదేశాలు రావడంతో పోలీస్ శాఖ సైతం ఆశ్చర్యపడినట్లు తెలుస్తోంది.
* ప్రజల్లోకి వర్మ
మరోవైపు పిఠాపురం వర్మ ప్రజల్లోకి బలంగా వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan) ఆయన వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోయినా.. వచ్చే ఎన్నికల నాటికి పవన్ కు చెక్ చెప్పేందుకేనని సంకేతాలు ఇవ్వగలిగారు. ఈ తరుణంలోనే ఇక నియోజకవర్గంపై ప్రతి వారం సమీక్ష నిర్వహించేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే పిఠాపురం వేదికగా మున్ముందు అనేక పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడం కూడా సర్వత్రా చర్చనీయాంశం అయింది.