Deputy CM Pawan Kalyan: పవన్ చేతికి పవర్.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు

ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సీఎం ఫోటో ఉండడం సాధారణం. ఈసారి తనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

Written By: Dharma, Updated On : June 19, 2024 12:00 pm

Deputy CM Pawan Kalyan

Follow us on

Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలను కేటాయించిన సంగతి తెలిసిందే. కీలక మంత్రిత్వ శాఖలతోపాటు పవన్ ఒక్కరికే డిప్యూటీ సీఎం హోదా కల్పించారు చంద్రబాబు. మిగతా మంత్రుల కంటే గౌరవం దక్కాలన్న కోణంలో ప్రత్యేక చాంబర్ ను ఏర్పాటు చేశారు. అధికారిక నివాసంతో పాటు క్యాంపు కార్యాలయాన్ని సైతం కేటాయించారు.

ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సీఎం ఫోటో ఉండడం సాధారణం. ఈసారి తనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అటు సచివాలయంలో సైతం పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా కార్యాలయాన్ని రూపొందించారు. టిడిపి కూటమిలో జనసేన కీలక భాగస్వామి కావడంతో చంద్రబాబు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక కాన్వాయ్ ని సైతం ఏర్పాటు చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జన సేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం దక్కడంతో జనసైనికుల్లో ఆనందం నెలకొంది.

సచివాలయంలో పవన్ కోసం ప్రత్యేక చాంబర్ ను ఏర్పాటు చేశారు. అదే సమయంలో విజయవాడలో నీటిపారుదల శాఖకు చెందిన భవనంలో పవన్ క్యాంప్ కార్యాలయం తో పాటు నివాసాన్ని సైతం ఏర్పాటు చేయడం విశేషం. పండితుల ఆశీర్వాదం, వేద మంత్రోచ్ఛరణల మధ్య పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పవన్ ను జనసేనకు చెందిన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తో పాటు మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో జనసైనికులు సంబరాలు చేసుకున్నారు. 2014లో జనసేన ఆవిర్భవించింది. 2019ఎన్నికల్లో బరిలో దిగింది.కానీ ఒక్క స్థానానికి పరిమితం అయింది.పవన్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో రకాల అవమానాలు పడ్డారు. ఈసారి ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి శత శాతం విజయాన్ని సొంతం చేసుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకొని పవర్ పాలిటిక్స్ ను ఎట్టకేలకు చేజిక్కించుకున్నారు. జనసైనికుల్లో విజయ గర్వాన్ని నింపారు.