Pawan Kalyan: వచ్చే ఎన్నికల నాటికి జనసేనకు ఒక ప్రత్యేక టీం ఏర్పాటు కానుందా? అదంతా వైసిపి కీలక నేతలతోనే ఏర్పాటు చేయనున్నారా? ఎట్టి పరిస్థితుల్లో జగన్ కు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారా? అందులో భాగంగానే వైసిపి పై భారీ స్కెచ్ వేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 1994 ఎన్నికల్లో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. అటు తరువాత 1999 ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి ఓటమి పలకరించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని అంతా భావించారు. ఈ క్రమంలోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి దూకుడుగా ముందుకు వచ్చారు. 2003లో ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవగలిగారు. అయితే ఈ క్రమంలో ప్రతి జిల్లాకు ఒక నాయకుడిని తయారు చేసుకున్నారు రాజశేఖర్ రెడ్డి. ఉత్తరాంధ్రకు చెందిన ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, కొణతాల రామకృష్ణ.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాకు ఒక బలమైన నాయకుడిని తయారు చేసుకున్నారు. బతికున్నంత వరకు వారితోనే రాజకీయాలు చేశారు. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఇటువంటి నేతలంతా జగన్ వెంట నడిచారు. కానీ జగన్ రాజకీయాలు వీరికి నచ్చడం లేదు. అలాగని ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు జనసేన రూపంలో వారికి ఒక ప్రత్యామ్నాయం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి అటువంటి వారిని జనసేన గూటికి తెచ్చి.. జగన్ ను దెబ్బ కొట్టడమే ధ్యేయంగా పవన్ వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది.
* ఉత్తరాంధ్రలో ఆ ఇద్దరు
ఈ ఎన్నికల అనంతరం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు వైసీపీని వీడారు. అనూహ్యంగా జనసేన పార్టీలో చేరారు. ఆయన ఒక్కరే కాదు పేరు మోసిన నేతలంతా జనసేన వైపు చూస్తున్నారు. దీని వెనుక పక్కా స్కెచ్ ఉంది. ఒకటి జనసేన బలోపేతం కావడం. రెండు వైసిపి బలహీనపడడం. వచ్చే ఎన్నికల నాటికి రాజశేఖర్ రెడ్డి టీం మొత్తం జనసేనలో చేరే ప్లాన్ చేస్తున్నట్లు బలమైన ప్రచారం నడుస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు పొలిటికల్ డిఫెన్స్ లో ఉన్నారు. ఆయన ఏ పార్టీలో చేరిన జిల్లా నాయకత్వం తన చేతిలో ఉండాలని భావిస్తారు. ఆయన తన కుమారుడి కోసం జనసేనలో చేరతారని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఆయన జగన్ నాయకత్వంపై పెద్దగా ఆసక్తి చూపించిన దాఖలాలు లేవు. అలాగని టిడిపిలో చేరలేరు. అందుకే ఆయన జనసేనలో చేరతారని తెలుస్తోంది.
* జగన్ ఎలా కట్టడి చేస్తారో
విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం జనసేనలో చేరతారని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. ఆయన చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడు కూడా. ఒకవేళ పవన్ పిలిస్తే ఆయన జనసేన లో చేరడం ఖాయం. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడు కావడంతో ఆయనగాని వైసీపీని వీడితే.. ఆ పార్టీకి మైనస్ కావడం ఖాయం.ఇప్పటికే బొత్స కుటుంబం జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఇద్దరే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి అనుచర గణమంతా జనసేనలోకి వెళ్లిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఉన్నవారితో రాజకీయం చేసుకుంటానని జగన్ చెబుతున్నారు. కానీ పార్టీ నుంచి సీనియర్లు వెళ్లిపోతే ఆ భారం పార్టీ తప్పకుండా పడుతుంది. అంతులేని నష్టం జరుగుతుంది. మరి వారు వెళ్లకుండా జగన్ ఎలా కట్టడి చేస్తారో చూడాలి.