Pawan Kalyan- Durga Devi Saree: పిఠాపురం( Pithapuram) నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. ప్రతి పండుగను ఒక వేడుకగా జరుపుకుంటున్నారు. తాజాగా దసరా ఉత్సవాలకు అమ్మవారికి చీరలు పంపించారు. పిఠాపురంలో పాదగయ క్షేత్రానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు అక్కడ ఘనంగా జరుగుతాయి. ఆలయంలోని రాజరాజేశ్వరి అమ్మవార్లకు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు కూడా చేస్తారు. పదో శక్తి పీఠమైన పూరుహితిక అమ్మవారికి కుంకుమార్చనలు కూడా చేస్తారు. అయితే దసరా శరన్నవరాత్రి వేడుకలకు గాను అమ్మవారిని అలంకరించేందుకు 22 చీరలను ప్రత్యేకంగా పంపారు. ఈ దేవీ నవరాత్రుల్లో ఒకరోజు పవన్ వచ్చి అమ్మవారిని దర్శించే అవకాశం ఉందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.
శ్రావణమాసంలో 14 వేల చీరలు..
గతంలో పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) శ్రావణమాసం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో మహిళలకు 14 వేల చీరలను అందించారు. పవన్ వదిన, ఎమ్మెల్సీ నాగబాబు భార్య పద్మజ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అప్పట్లో పాదుగయ క్షేత్రంలో ఐదు బృందాలుగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. వేలాది మంది మహిళలు ఈ సామూహిక పూజల్లో పాల్గొన్నారు. వారికి నాగబాబు భార్య పద్మజ పవన్ కళ్యాణ్ సమకూర్చిన 14000 చీరలను అందించారు. అయితే ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కోసం చీరలు పంపించడం పై మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.
రాఖీ పండుగ నాడు..
మరోవైపు పిఠాపురంలో రాఖీ పండుగ( Rakhi festival) సందర్భంగా వితంతు మహిళలకు 1500 చీరలను పంపించారు పవన్ కళ్యాణ్. వివిధ కారణాలతో వైధవ్యం పొందిన మహిళలకు సోదరుడిగా అండగా నిలిచారు పవన్. సోదరుడిగా తాను ఉన్నానని భరోసా కల్పించేందుకు, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు పవన్ చీరలను అందజేశారు. జనసైనికులు ఇంటింటికి వెళ్లి ఈ చీరలను అప్పట్లో అందించారు. ఏపీ డిప్యూటీ సీఎం గా ఉంటూ పిఠాపురం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. ప్రతి వర్గానికి దగ్గర అయ్యేలా ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా తనకు ప్రతి నెల వచ్చే వేతనం నుంచి నియోజకవర్గంలో అనాధ పిల్లలకు ఒక్కొక్కరికి ఐదువేల చొప్పున అందిస్తున్న సంగతి తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అనాధ పిల్లలందరినీ దత్తత తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న పాదుగయాలో దసరా వేడుకలకు చీరలు పంపించి తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు పవన్ కళ్యాణ్.