ఏపీలో( Andhra Pradesh) కూటమి మధ్య మరింత బంధం ఎక్కువవుతోంది. దిగువ స్థాయిలో ఎన్ని రకాల విభేదాలు ఉన్నా.. మూడు పార్టీల నాయకత్వాలు మాత్రం పరస్పరం గౌరవించుకుంటున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఈరోజు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రులతో కలిసి చేపట్టిన ఈ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మరోసారి ఏపీ సీఎం చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. మరోసారి రాజకీయ ప్రత్యర్థులను డిఫెన్స్ లో పడేశారు. సొంత పార్టీ జనసేన నేతలకు సైతం సరైన సంకేతాలు పంపారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పారు.
* పవన్ ఎప్పుడూ కీలకమే
ఏపీలో కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఒక్క కూటమి కట్టడం వరకే కాదు సీట్ల సర్దుబాటు, అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవుల కేటాయింపులు,, నామినేటెడ్ పదవుల పంపకాలు.. ఇలా అన్నింట క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే కూటమి విచ్ఛిన్నానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఆ ప్రయత్నాలను నిర్వీర్యం చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. కూటమి అన్నాక సొంత పార్టీ శ్రేణులనుంచి కూడా ఆయనకు ఒత్తిడి ఉంటుంది. కానీ వాటన్నింటినీ అధిగమించి.. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా.. ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగారు. కూటమిని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు.
* దురంధరుడు అంటూ వర్ణన
అనకాపల్లి జిల్లాలో( Anakapalli district ) స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతి రాజు శ్రీనివాస్ వర్మతో పాటు రాష్ట్ర మంత్రులంతా వచ్చారు. మూడు పార్టీల శ్రేణులు హాజరయ్యాయి. అయితే అందరికీ మించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆకట్టుకుంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలోనూ.. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలోనూ చంద్రబాబు సీనియారిటీ పని చేసిందని.. ఆయన దార్శనికత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు అంత అనుభవం లేదని తేల్చేశారు. చంద్రబాబును దురంధరుడుగా అభివర్ణించారు. అయితే ఇది ఎంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని అంశం. పైగా జనసేనలో టిడిపి వ్యతిరేక భావాలు ఉన్నవారికి సైతం ఇది ఇష్టం లేని మాట. అయితే పవన్ కళ్యాణ్ ప్రతిసారి కూటమి విచ్ఛిన్నానికి జరుగుతున్న ప్రయత్నాన్ని విఫలం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు.
