Pawan Kalyan: జనసేన ఆవిర్భవించి 10 ఏళ్లవుతోంది. 2014లో ఆ పార్టీ తెరపైకి వచ్చింది. అంతకుముందే ప్రజారాజ్యం ద్వారా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ జనసేనతోనే యాక్టివ్ రాజకీయాలు ప్రారంభించారు. అయితే పవన్ రాజకీయాల్లోకి రావడం చాలామందికి ఇష్టం లేదు. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులే అభ్యంతరాలు వ్యక్తం చేశారని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఎంత మంచి స్టార్ డం వదులుకొని రాజకీయాలు ఎందుకని కూడా ప్రశ్నించినట్లు నాగబాబు ఒకటి రెండు సందర్భాల్లో చెప్పారు. అయితే కుటుంబ సభ్యులే కాదు స్నేహితులు కూడా రాజకీయాలు వద్దని పవన్ కు చెప్పారట. ఆ విషయం తాజాగా పవనే చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తాను రాజకీయాల్లోకి రాకుండా చేయాలని స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా ప్రయత్నించిన విషయాన్ని ప్రస్తావించారు.
జనసేన ఆవిర్భావ సభ నిన్న మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగింది. పవన్ కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన విషయంలో చూపిన చొరవ గురించి ప్రస్తావించారు. తాను రాజకీయాల్లోకి రావడం త్రివిక్రమ్ కు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. ఒకానొక సమయంలో పార్టీని నడపడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో త్రివిక్రమ్ ఆర్థికంగా అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కష్టకాలంలో వెన్నంటి ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు. తాను నిత్యం సమాజం గురించి ఆలోచిస్తే.. నా గురించి ఆలోచించే వ్యక్తి త్రివిక్రమ్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అతని కోసమే వకీల్ సాబ్ తో పాటుగా మరో మూడు నాలుగు సినిమాలు చేసినట్లు కూడా చెప్పారు.
త్రివిక్రమ్ తో పవన్ కళ్యాణ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. పవన్ చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు కూడా. అయితే ఇప్పుడు ఏకంగా పార్టీ ఆవిర్భావ సభలో ఆయన గురించి ప్రస్తావించడం విశేషం. అయితే తాను రాజకీయాల్లోకి వచ్చి చాలా ఇబ్బంది పడ్డానని.. తన ఆత్మీయులు అడ్డు చెప్పినా రాజకీయాల్లోకి వచ్చి.. ప్రజల కోసం ఆలోచించానని చెప్పే ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల్లో సైతం తాను ఓడిపోతానని ముందే తెలుసని.. అయినా సరే ప్రజల కోసం పనిచేయాలని.
.. ప్రజల వెంట చివరి వరకు నడవాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తేల్చి చెప్పారు. విలువైన స్టార్ డమ్ ను వదులుకొని మీకోసం వచ్చానని జన సైనికులకు స్పష్టం చేశారు. అయితే పార్టీ ఆవిర్భావ సభలో స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం మాత్రం గమనార్హం.