Janasena Varahi Yatra 4th Phase : కృష్ణాజిల్లా అవనిగడ్డ జనసంద్రంగా మారింది. మూడో విడత వారాహి యాత్ర ప్రారంభమైంది. వస్తూ వస్తూనే పవన్ జగన్ పై విరుచుకుపడ్డారు. పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. అమరావతి లోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదివారం సాయంత్రం అవనిగడ్డ చేరుకున్న పవన్ యాత్ర ప్రారంభించారు. టిడిపి తో పొత్తు ఉంటుందని ప్రకటన చేసిన తర్వాత జరుగుతున్న యాత్ర కావడంతో అందరిలోనూ ఒకటే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వారాహి యాత్రలో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం పార్టీ శ్రేణులకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో యాత్రలో జనసేన తో పాటు టిడిపి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నాయి.
పవన్ ఉత్సాహంగా ప్రసంగించారు. నేరుగా సీఎం జగన్ పైనే విమర్శలను ఎక్కుపెట్టారు. చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి పవన్ పరామర్శించిన సంగతి తెలిసిందే. అటు నుంచి బయటకు వచ్చిన తర్వాత పొత్తు ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే నడుస్తాయని ప్రకటించారు. బిజెపి కలిసి వస్తే కలుపుకొని పోతామని కూడా స్పష్టం చేశారు. ఇటువంటి తరుణంలో వారాహి మూడో విడత యాత్రపై హై టెన్షన్ నెలకొంది. జగన్ సర్కార్ పై పవన్ తప్పకుండా టార్గెట్ చేస్తారని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే పవన్ విరుచుకుపడ్డారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమని పవన్ తేల్చి చెప్పారు. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధంతో పోల్చారు. మేం పాండవులు.. మీరు కౌరవులు.. మీ ఓటమి ఖాయమని తేల్చేశారు. తప్పకుండా మేము అధికారంలోకి వస్తామని ప్రకటించారు. అన్ని వర్గాలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఉద్యోగ భర్తీని చేపట్టి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అన్నది ఉండకుండా చేస్తామని చెప్పుకొచ్చారు. 30 వేల టీచర్ ఉద్యోగాలతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని అవనిగడ్డ వేదికగా ప్రకటించారు.
అయితే ఈసారి వారాహి యాత్రలో రాష్ట్రంలో ప్రధాన సమస్యలను పవన్ అజెండాగా తీసుకున్నారు. ప్రస్తుతం జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్న సంగతి తెలిసిందే. అటు ఉద్యోగ భర్తీ ప్రకటనలు లేక నిరుద్యోగ యువకులు సైతం అసంతృప్తితో ఉన్నారు. ఈ తరుణంలో వారి సమస్యలపై పవన్ ఫోకస్ పెట్టారు. మూడో విడత యాత్రలో చాలా సమస్యలపై పవన్ క్లారిటీ ఇవ్వనున్నారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనులపై స్పష్టమైన ప్రకటనలు చేయనున్నారు. తొలి రోజే స్పష్టమైన సంకేతాలు పంపారు.