Pawan Kalyan: ఏపీలో( Andhra Pradesh) ఎన్నో చారిత్రాత్మక, వారసత్వ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కానీ కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. ఉన్న వాటిని సైతం కాపాడడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లోని ఎర్ర మట్టి దిబ్బలు, తిరుమల కొండలు అరుదైన గుర్తింపు దక్కించుకున్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేరాయి. ఏ ప్రాంతం అయినా వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాలంటే ముందుగా తాత్కాలిక జాబితాలోకి చేరాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు, ఈ వారసత్వ సంపద పటిష్టతకు తీసుకునే చర్యలను బట్టి.. అసలైన జాబితాలో స్థానం పొందే అవకాశం ఉంటుంది. అయితే గతంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. ఎర్రమట్టి దిబ్బలను పరిరక్షించాలని కోరారు. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఈ సూచనలను పరిగణలోకి తీసుకుంది. పైగా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక చర్యలు ప్రారంభమయ్యాయి. అందుకే ఈ అరుదైన గుర్తింపు దక్కినట్లు తెలుస్తోంది.
* తీరం వెంబడి
ఎర్ర మట్టి దిబ్బలను.. ఎర్ర ఇసుక దిబ్బలు గా కూడా పిలుస్తారు. ఇవి విశాఖ( Visakhapatnam) సమీపంలోని తీరం వెంబడి 1500 ఎకరాలలో విస్తరించి ఉన్నాయి. ఇసుక, సిల్ట్, బంక మట్టితో కూడిన మిశ్రమమే ఎర్రమట్టి దిబ్బలు. వేల సంవత్సరాల్లో సహజ ఆక్సీకరణ ఫలితంగా వాటి ప్రత్యేకమైన ఎర్రటి రంగు ఏర్పడింది. ఇవి సముద్రమట్టంలో హెచ్చుతగ్గులు, వాతావరణం లో సమూల మార్పులు కారణంగా ఏర్పడినట్లు పరిశోధకులు గుర్తించారు. 1886లో బ్రిటిష్ భూ విజ్ఞాన శాస్త్రవేత్త విలియం కింగ్ మొదటిసారిగా డాక్యుమెంట్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితం అయ్యాయి. ప్రపంచంలో ఇలాంటివి మరో రెండు ప్రాంతాల్లో ఉన్నాయి. తమిళనాడుతో పాటు శ్రీలంకలో ఎర్రమట్టి దిబ్బలు విస్తరించాయి. 2016లో ఎర్రమట్టి దెబ్బలను జాతీయ భౌగోళిక వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించింది. మరోవైపు తిరుపతి జిల్లాలోని తిరుమల కొండలు భౌగోళిక పర్యావరణ సాంస్కృతిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక్కడ 2.5 బిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగిన వాళ్లు కూడా ఉన్నాయి. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనంలో భాగంగా ఉన్నాయి. అటు విశాఖలో ఎర్రమట్టి దిబ్బలు, తిరుమల కొండలకు ఇలా అంతర్జాతీయ ఖ్యాతి రావడం పై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
* పవన్ పరిశీలన..
విపక్షంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan) ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎర్రమట్టి దిబ్బలు ధ్వంసం అవుతున్నాయని ఆరోపించారు. ఇది వారసత్వ సంపదగా అప్పట్లో పవన్ పేర్కొన్నారు. పర్యాటకం పేరుతో ఈ విధ్వంసం జరుగుతోందని.. దీనిని నిలుపుదల చేయకుంటే.. జనసేన ఉద్యమిస్తుందని కూడా హెచ్చరించారు. అప్పట్లో పవన్ హెచ్చరికలతో వైసిపి ప్రభుత్వం అప్రమత్తం అయింది. కొన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టింది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ఎర్రమట్టి దిబ్బలకు ప్రపంచ గుర్తింపు సంస్థ అరుదైన జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.