Pawan Kalyan : జనసేన ( janasena ) బలోపేతంపై దృష్టి పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బలం పెంచుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా కొన్ని ఎంపిక చేసుకున్న జిల్లాల్లో పార్టీని మరింత విస్తృతం చేయాలని చూస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. సుదీర్ఘ పోరాటం తర్వాత ఏపీలో అధికారంలోకి రాగలిగారు. కూటమిలో కీలక భాగస్వామిగా మారారు. అయితే ఇప్పుడే బలపడేందుకు సరైన సమయం అని భావించి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రస్థాయి కమిటీ నుంచి జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే గత ఏడాది అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రస్థాయి కమిటీని ప్రకటించారు. అయితే ఈసారి గ్రామ కమిటీలను సైతం ఏర్పాటు చేస్తుండడం విశేషం. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* పార్టీని విస్తరించాలని..
గడిచిన ఎన్నికల్లో 100 స్ట్రైక్ రేట్ తో( strike rate) జనసేన విజయం సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. నామినేటెడ్ పదవుల్లో సైతం ప్రాతినిధ్యం తగ్గించుకుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం సత్తా చాటాలని చూస్తోంది. అందుకే గ్రామ, మండల కమిటీలకు ప్రాధాన్యమిస్తోంది. ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయ బృందం వివిధ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు, వీర మహిళలకు సమావేశాలు నిర్వహించింది. క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు, సూచనలను స్వీకరించింది. ఈ డేటాను ఆధారంగా చేసుకుని కమిటీల కూర్పును రూపొందిస్తున్నారు. దిగువ స్థాయి కార్యకర్తల మనోభావాలను సైతం తెలుసుకునే ప్రయత్నం చేశారు.
* ప్రధానంగా ఆ జిల్లాలపై..
ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో జనసేనకు ప్రాతినిధ్యం ఉంది. అందుకే ఈసారి రాయలసీమతో పాటు కోస్తా జిల్లాలపై దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై పవన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడి నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసి కార్యక్రమాలను వేగవంతం చేయాలని పవన్ భావిస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణుల సహాయం తీసుకోవడమే కాదు.. పార్టీ బలాన్ని విస్తరించడం పై దృష్టి పట్టాలని నిర్ణయించారు. మండల, గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పడితే ప్రజల సమస్యలను త్వరగా స్పందించవచ్చని.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొత్తానికైతే జనసైనికులు జోష్ నింపే వార్త చెప్పారు పవన్ కళ్యాణ్. ఇప్పటివరకు జనసేనకు గ్రామస్థాయిలో కమిటీలు లేవు. అయితే ఈ కమిటీల ద్వారా స్థానిక సంస్థల్లో కొన్ని పదవులు దక్కించుకోవాలన్నది పవన్ ప్లాన్.