Pawan Kalyan Donation: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు( AP deputy CM Pawan Kalyan ) విపరీతమైన సెంటిమెంట్ ఉండేది. ఆయనలో భక్తి భావాలు అధికం. జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వారాహి యాత్రకు ముందు ఆయన తెలంగాణలోని ఓ ఆలయానికి తరచూ వెళ్లేవారు. అదే ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం. జగిత్యాల జిల్లాలో ఉంది. అప్పట్లో ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకునే వారు పవన్ కళ్యాణ్. మొక్కులు కూడా చెల్లించుకున్నారు. వరాహి యాత్ర విజయవంతం కావాలని కోరుతూ ఆయన పూజలు కూడా చేసేవారు. అయితే ఇప్పుడు అదే ఆలయానికి ఏకంగా 30 కోట్ల రూపాయలు ఇప్పించారు పవన్ కళ్యాణ్. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ నిధులు మంజూరు చేయించినట్లు సమాచారం. పవన్ ప్రత్యేక సిఫార్సులతోనే ఆ నిధులు కేటాయించినట్లు దేవాదాయ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారికంగా త్వరలో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ప్రత్యేక సెంటిమెంట్..
పవన్ కళ్యాణ్ కు కొండగట్టు( Kondagattu) ఆలయం అనేది ప్రత్యేక సెంటిమెంట్. ఆయన రాజకీయ జీవితంలో పలుమార్లు ఈ ఆలయాన్ని సందర్శించారు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో కూడా ఈ ఆలయానికి వచ్చి పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయి. జనసేన పార్టీ ప్రారంభ సమయంలో కూడా పూజలు చేశారు. ఆంజనేయస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు వారాహి వాహనానికి ఇదే ఆలయంలో పూజలు కూడా చేశారు. అంతటి సెంటిమెంట్ ఈ ఆలయంతో పవన్ కళ్యాణ్ కు.
గత ఏడాది ఆలయ సందర్శన సమయంలో..
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఆలయ అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. భక్తుల సౌకర్యార్థం వసతి కోసం వంద గదులు, దీక్ష మండపం నిర్మాణానికి ఈ 30 కోట్ల రూపాయల టీటీడీ నిధులను వినియోగించనున్నట్లు తెలుస్తోంది. 2024 జూన్ లో వారాహి దీక్షలో భాగంగా కొండగట్టు వెళ్లారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దేవస్థానం దుస్థితిని పవన్ కళ్యాణ్ కు వివరించారు. అప్పట్లో సానుకూలంగా స్పందించారు పవన్. ఇప్పుడు టీటీడీ నుంచి నిధులు ఇప్పించారు.