https://oktelugu.com/

Pawan Kalyan: ఎన్డీఏ ఎంపీలకు పవన్ కళ్యాణ్ విందు వెనక పెద్ద కథ

మొన్నటి ఎన్నికల వరకు ఒక లెక్క.. ఎన్నికల తరువాత మరో లెక్క అన్నట్టు ఉంది పవన్ పరిస్థితి. పవన్ క్రేజ్ అమాంతంగా పెరుగుతోంది. జాతీయస్థాయిలో మార్మోగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం తన ముద్ర చాటుకుంటున్నారు పవన్.

Written By:
  • Dharma
  • , Updated On : November 28, 2024 / 11:21 AM IST

    Pawan Kalyan(43)

    Follow us on

    Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయంగా కీలకంగా మారుతున్నారు. ఎన్డీఏ లో భాగస్వామిగా ఉన్న పవన్ తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రభావం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బిజెపి కూటమి ఏకపక్ష విజయం సాధించింది అక్కడ. అక్కడ బిజెపికి మద్దతుగా పవన్ ప్రచారం చేశారు. పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో దాదాపు బిజెపితో పాటు కూటమి విజయం సాధించింది. ఈ తరుణంలోనే పవన్ హస్తినబాట పట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో కూటమి సమీకరణానికి పవన్ కీలక పాత్ర పోషించారు. పవన్ చొరవతోనే కూటమి ఏర్పాటై ఏపీలో ఘన విజయం సాధించింది. అందుకే చంద్రబాబు ఏకైక డిప్యూటీ సీఎం పోస్టును పవన్ కు కట్టబెట్టారు. ఆయన కోరుకున్న శాఖలను అప్పగించారు.ఒకవైపు ఏపీ పై ప్రభావం చూపుతూనే జాతీయ స్థాయిలో సైతం పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ బలమైన నినాదంతో ముందుకు సాగిన పవన్ అవసరాన్ని గుర్తించింది బిజెపి. ఆయనతో మహారాష్ట్రలో ప్రచారం చేయించింది. అక్కడ విజయవంతం కావడంతో జాతీయస్థాయిలో పవన్ సేవలను వినియోగించుకోవాలని చూస్తోంది. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీని కలిశారు. ఏకంగా ఆరుగురు కేంద్ర మంత్రులను ఒకేరోజు కలుసుకున్నారు. దీంతో పవన్ ఢిల్లీ పర్యాటక మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

    * పక్షం రోజుల్లో ఇది రెండోసారి
    పక్షం రోజుల్లో పవన్ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. వారికి వారాహి డిక్లరేషన్ పత్రాలను అందించారు పవన్. అదే సమయంలో ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీల పట్ల పవన్ సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు పవన్ చొరవతోనే ఏపీకి కేంద్రం ప్రత్యేక ప్రాజెక్టులు మంజూరు చేస్తుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఏపీకి సంబంధించిన పెండింగ్ పనులను చకచకా క్లియర్ చేయాలని కేంద్ర మంత్రులను మోదీ ఆదేశించినట్లు సమాచారం. పవన్ నుంచి ఎలాంటి రిక్వెస్టులు వచ్చినా వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని కేంద్ర పెద్దల నుంచి అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. దీంతో పవన్ విషయంలో బిజెపి పక్కా ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తోంది.

    * ఎన్డీఏ ఎంపీలకు విందు
    పనిలో పనిగా ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎన్ డి ఏ ఎంపీలకు విందు ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్. తాజ్ హోటల్ లో జరిగిన ఈ విందుకు కేంద్ర మంత్రులతో పాటు ఎంపీలు హాజరయ్యారు. ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, తెలంగాణకు చెందిన ధర్మపురి అరవింద్, ఎంపీలు సైతం హాజరయ్యారు. వారందరికీ ఆత్మీయంగా స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి పనిచేద్దామని పిలుపునిచ్చారు. మొత్తానికి అయితే పవన్ మేనియా అమాంతం పెరిగినట్టు కనిపిస్తోంది. జాతీయస్థాయిలో పవన్ పరపతి పెరగడంతో పాటు.. తెలుగు రాష్ట్రాలపై స్పష్టమైన ముద్ర ఉండేలా పవన్ చూసుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.