Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) ఏదైనా చెబితే చేస్తారు. చేసేది మాత్రమే చెబుతారు. అన్నింటికీ మించి ప్రాక్టికల్ గా ఉంటారు. అందుకే మొన్న అతిపెద్ద సమస్య అయిన కోనసీమ కొబ్బరి రైతుల విషయానికి వచ్చేసరికి నిర్మొహమాటంగానే చెప్పేశారు. ఇది పెద్ద సమస్య అని.. తాను ముఖ్యమంత్రిని కాదని.. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చూపిస్తానని చెప్పారు. అంతేకానీ చేసేస్తానని మాత్రం చెప్పలేదు. అయితే కొన్ని వ్యవస్థీకృత లోపాలపై మాత్రం గట్టిగానే ఉంటారు పవన్ కళ్యాణ్. తాజాగా పిఠాపురం మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఐదుగురు అధికారులపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు రావడం.. అవి రుజువు కావడంతో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీని వెనుక మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఉన్నాయి.
* అవినీతికి తావు లేకుండా
అవినీతికి తావు ఉండకూడదని పవన్ కళ్యాణ్ నిత్యం చెబుతుంటారు. కూటమి పాలనలో అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే ఇటువంటి ప్రకటనలు తన నియోజకవర్గంలో అమలు చేస్తే మంచి సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని పవన్ భావించారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి పనుల విషయంలో అప్పట్లో అధికారులు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిపై దర్యాప్తు చేయగా నిజమేనని తేలింది. అయితే ఏకంగా ఐదుగురుపై పిఠాపురం మున్సిపాలిటీలో చర్యలు తీసుకోవడం అనేది సంచలనం కలిగించిన అంశమే. అయితే ఒక్క పిఠాపురంలో కాదు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో వైసిపి హయాంలో భారీగా అవినీతి జరిగింది. ముఖ్యంగా అభివృద్ధి పనుల విషయంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తూ పనులు జరిపించారు. అవినీతి నియంత్రణ అనేది మాటలకు పరిమిత కాకుండా ఉండేందుకు కూటమి వచ్చిన తర్వాత దీనిపై విచారణ చేపట్టింది. నిజమేనని తేలడంతో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఉన్న బాధిత అధికారులపై చర్యలకు ఉపక్రమించింది కూటమి ప్రభుత్వం.
* నేతల విషయంలో సైతం..
అయితే యంత్రాంగం పరంగానే కాకుండా పార్టీ పరంగా కూడా అవినీతి ఆరోపణలు వస్తే ఆ మరుక్షణం చర్యలకు ఉపక్రమిస్తున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురం( Pithapuram ) నియోజకవర్గంలో జనసేన నేత విషయంలో అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ ఐదుగురు నేతలతో ఒక క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. తాను డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించడంతో నియోజకవర్గ విషయంలో ఆ ఐదుగురు నేతల బృందమే అన్ని బాధ్యతలు తీసుకుంటుంది. వారే అక్కడ జనసేన పార్టీ తరఫున కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఒక నేతపై ఆరోపణలు రావడంతో వెంటనే చర్యలకు దిగారు పవన్ కళ్యాణ్. అలాగే యంత్రాంగంలో సైతం పారదర్శక సేవలు అందించాలంటే అవినీతిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురంలో అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడం ద్వారా గట్టి సంకేతాలను పంపగలిగారు.