https://oktelugu.com/

Pawan Kalyan: తిరుపతి నుంచి పవన్ పోటీ.. జగన్ పెద్ద ప్లాన్?

రుపతి అసెంబ్లీ స్థానానికి భూమన అభినయ్ రెడ్డి పేరును జగన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ అయిన భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడే అభినయ్ రెడ్డి. వై వి సుబ్బారెడ్డి ని మార్చిన తర్వాత కరుణాకర్ రెడ్డి టీటీడీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Written By: , Updated On : March 7, 2024 / 05:13 PM IST
Pawan Kalyan

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: ఈ ఎన్నికల్లో పవన్ ను చావు దెబ్బ తీయాలని జగన్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అదే మాదిరిగా ఈ ఎన్నికల్లో సైతం పవన్ ను ఓడించాలని జగన్ భావిస్తున్నారు. పవన్ ఎక్కడి నుంచి బరిలో దిగినా అక్కడ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలని చూస్తున్నారు. సామాజిక సమీకరణలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గట్టి అభ్యర్థిని పవన్ పై పోటీ పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. అయితే తాజాగా తిరుపతిలో పవన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. జగన్ యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది.

తిరుపతి అసెంబ్లీ స్థానానికి భూమన అభినయ్ రెడ్డి పేరును జగన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ అయిన భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడే అభినయ్ రెడ్డి. వై వి సుబ్బారెడ్డి ని మార్చిన తర్వాత కరుణాకర్ రెడ్డి టీటీడీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో తిరుపతి అసెంబ్లీ స్థానానికి వచ్చే ఎన్నికల్లో కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డిని జగన్ ఎంపిక చేశారు. ప్రస్తుతం అభినయ్ రెడ్డి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. కరుణాకర్ రెడ్డి వారసుడిగా అభినయ్ కు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన చిరంజీవి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో పూర్వాశ్రమంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేసిన నేతలకు పవన్ కళ్యాణ్ టచ్ లోకి వెళ్లారు. నియోజకవర్గ స్థితిగతులను తెలుసుకున్నారు. దీంతో పవన్ పోటీ ఖాయమని ప్రచారం జరుగుతోంది. అంతకుముందు పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తారని తెలియడంతో జగన్ అలెర్ట్ అయ్యారు. ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి రప్పించేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు పవన్ మనసు మార్చుకుని తిరుపతి వైపు రావడంతో కొత్త వ్యూహానికి పదును పెట్టినట్లు తెలుస్తోంది.

తిరుపతి అసెంబ్లీ స్థానంలో బలిజ ఓట్లు అధికం. అదే స్థాయిలో బీసీ ఓటర్లు సైతం ఉంటారు. తప్పకుండా బలిజలు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతారు. అందుకే జగన్ ఇప్పుడు బీసీలను తెరపైకి తెచ్చే పనిలో పడ్డారు. ప్రస్తుతం తిరుపతి కార్పొరేషన్ మేయర్ గా శిరీష ఉన్నారు. ఆమె వెనుకబడిన తరగతులకు చెందినవారు. పైగా బలమైన మహిళా నేత. ఆమెను వైసీపీ అభ్యర్థిగా బరిలో దించితే మంచి ఫలితం ఉంటుందని జగన్ ఆలోచన చేస్తున్నారు. అదే జరిగితే అభినయ్ రెడ్డికి మేయర్ పదవి అప్పగించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రచారం కార్యరూపం దాల్చుతుందో? లేదో? చూడాలి.