Pawan Kalyan : సినీ పరిశ్రమలో మెగా కుటుంబానిది ప్రత్యేక స్థానం.మెగా కాంపౌండ్ వాల్ నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారు. అదే కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. అయితే ఆయన తనకంటూ ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో మెగా కుటుంబానికి దూరమయ్యారని వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడంతో రచ్చ ప్రారంభం అయింది. అది ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. అయితే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రానికి సంబంధించి టికెట్ ధరల పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఆ సందర్భంలో అల్లు అర్జున్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో కొంత వాతావరణం చల్లబడింది. అయితే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలవనున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
* అండగా మెగా కుటుంబం
పుష్ప 2 చిత్రం చూసేందుకు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో తొక్కిసలాట జరగడంతో ఒక మహిళ మృతి చెందారు. ఒక సినీ సెలబ్రిటీ అయి ఉండి కనీస సమాచారం లేకుండా అల్లు అర్జున్ రావడం తప్పుగా భావించారు పోలీసులు. అందుకే కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఒక రాత్రంతా అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్లో గడపాల్సి వచ్చింది. మధ్యంతర బెయిల్ దక్కడంతో బయటపడ్డారు అల్లు అర్జున్. ఆ సమయంలో అల్లు అర్జున్ కు అండగా నిలబడింది మెగా కుటుంబం. దీంతో దానికి కృతజ్ఞతగా మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబులను కలిశారు అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్ ను సైతం కలుస్తారని ప్రచారం జరిగింది. శనివారం కార్యక్రమానికి హాజరయ్యేందుకు పవన్ హైదరాబాద్ వచ్చారు. కానీ అల్లు అర్జున్ కలిసేందుకు వీలుపడలేదు.
* ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు
ఈరోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళనున్నారు. ఎయిమ్స్ వార్షికోత్సవ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమరావతి రానున్నారు. విమానాశ్రయంలో ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు పవన్ కళ్యాణ్. అటు తరువాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్ళనున్నారు. అయితే అల్లు అర్జున్ పవన్ ఇంటికి వచ్చి కలిసే అవకాశం ఉంది. ఈ తరుణంలో గత కొద్ది రోజులుగా ఆ రెండు కుటుంబాల్లో నెలకొన్న వివాదానికి ఫుల్ స్టాప్ పడే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.