Deputy CM Pawan Kalyan : కేంద్ర నిధులు.. కనిపించని ప్రధాని బొమ్మ.. పవన్ సీరియస్!

 గత ఐదు సంవత్సరాలుగా కేంద్ర నిధులతో నేరుగా అభివృద్ధి పనులు చేయలేదు వైసీపీ సర్కార్. నిధుల మళ్లింపుతో గ్రామీణాభివృద్ధి పడకేసింది. ఇటువంటి తరుణంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్.. కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెప్పించారు. అదే నిధులను గ్రామీణాభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలని ఆదేశించారు.

Written By: Dharma, Updated On : October 15, 2024 4:58 pm

Deputy CM Pawan Kalyan

Follow us on

Deputy CM Pawan Kalyan :  ఏపీవ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం వేడుకగా ప్రారంభం అయ్యింది.దాదాపు 13 వేలకు పైగా పంచాయతీల్లో రూ.4500 కోట్ల రూపాయలతో.. దాదాపు 30 వేల పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవి పూర్తిగా ఉపాధి హామీ నిధులే. గత ఐదేళ్లుగా గ్రామాల అభివృద్ధికి మంజూరైన ఈ నిధులు పక్కదారి పట్టాయి. సంక్షేమ పథకాలకు మళ్లించారు. అందుకే ఇప్పుడు పవన్ ఆ నిధులు నేరుగా.. గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలని ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా అడుగులు వేశారు. ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయితీల్లో గ్రామసభలు నిర్వహించారు.ప్రజలకు అవసరమైన పనులను గుర్తించారు. ఆ పనులకే తొలి ప్రాధాన్యం ఇచ్చి నిధులు మంజూరు చేశారు. వంద రోజుల్లో ఆ పనులు పూర్తి చేయాలని సంకల్పించారు.గ్రామాల్లో రహదారులు,కాలువలు, డ్రైన్ల నిర్మాణానికి ఈ నిధులు ఖర్చు చేయాలని భావించారు. ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు అని..వాటితో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పవన్ పిలుపునిచ్చారు.అయితే ఈ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాని మోడీకి చోటు దక్కలేదు. దీంతో పవన్ దీనిని సీరియస్ గా తీసుకొని యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
 * సంక్షేమ పథకాలకు మళ్లింపు 
 గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయి. ఉపాధి హామీ పథకం తో పాటు ఆర్థిక సంఘం నిధులు చేరాయి.కానీ ఆ నిధులను నేరుగా ఖర్చు చేయలేదు. సంక్షేమ పథకాల కోసం మళ్ళించారు. దీంతో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అయితే అప్పట్లో జగన్ ఎక్కడా మోడీ ఫోటో కనిపించకుండా చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపట్టిన పనుల విషయంలో సైతం.. కేంద్ర పెద్దలకు ఎటువంటి ప్రాధాన్యం దక్కలేదు. చివరకు కోవిడ్ అనంతరం ప్రజలకు కేంద్రం ఉచిత రేషన్ అందించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కూడా ప్రధాని మోడీ ఫోటో పెట్టలేదు. ఒకటి రెండు సార్లు బిజెపి నేతలు హడావిడి చేశారు. కానీ ప్రధాని మోడీ ఫోటో పెట్టకపోయినా రాష్ట్ర బిజెపి నేతలు సైతం పట్టించుకోలేదు.
 * అందరితో సమన్వయం 
 అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం దశాబ్ద కాలం ఉండాలన్నది పవన్ ముఖ్య ఉద్దేశం. అందుకే ఇటు సీఎం చంద్రబాబుతో పాటు అటు కేంద్ర పెద్దలను సైతం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు పవన్. ఎట్టి పరిస్థితుల్లో విభేదాలకు తావు ఇవ్వకూడదని భావిస్తున్నారు. రాష్ట్రంపై కేంద్ర పెద్దలకు  అనుమానం, అపార్ధాలు కలిగేలా ఏ నిర్ణయం వద్దని భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రధాని మోదీ ఫోటో లేకుండా ఉండడాన్ని గుర్తించారు. వెంటనే ప్రతి ఫ్లెక్సీలో ప్రధాని బొమ్మ ఉండేలా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.