Pawankalyan : గ్రామ పంచాయతీలే దేశానికి పట్టుకొమ్మలు. గాంధీగారు చెప్పిన మాట ఇది. దేశానికి ప్రధాని అయినా పంచాయతీలో అడుగుపెడితే ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ దే తొలిస్థానం. అంతటి శక్తివంతమైన పదవిని, పంచాయతీలను జగన్ తేలిక చేసేశారు. వలంటీరుకు ఉన్న గౌరవం కూడా సర్పంచ్ కు దక్కకుండా చేశారు. వలంటీర్ల వ్యవస్థలో ఉన్న లోపాలపై పవన్ ప్రస్తావించేసరికి సరిచేయాల్సింది పోయి వారితోనే ఎదురుదాడి చేయిస్తున్నారు. తమను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని.. తమ విధులు, నిధులకు గండి కొట్టారని, పంచాయతీలను నిర్వీర్యం చేశారని సర్పంచ్ లు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతుంటే మాత్రం రోడ్లపై వెంబడించి మరీ నియంత్రిస్తున్నారు. పోలీసులతో ఉక్కుపాదం మోపుతున్నారు.
ఇటీవల గాంధీ గారి అడుగు జాడల్లో నడుస్తున్నట్టు జగన్ ఒక పెయింటింగ్ వేసుకున్నారు. గాంధీజీ తో సమానంగా జగన్ అన్నట్టు భావిస్తున్న ఈ చిత్రం చూస్తే ఓ రకమైన ఫీలింగ్ కలుగుతుంది. గాంధీగారు కలలు కన్న గ్రామస్వరాజ్యం తెచ్చినట్టు వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. పంచాయతీలను నిర్వీర్యం చేసి..సర్పంచ్ ల హక్కులను దూరం చేసి..నిధులు పక్కదారి పట్టించేసి.. పాడి పరిశ్రమను గుజరాత్ కు తాకట్టు పెట్టేసి.. అక్కడే గాంధీగారు పుట్టారు కదా అని నమ్మించి మరీ గ్రామస్వరాజ్యం కట్టు కథలను అల్లుతున్నారు. అల్లికలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
పంచాయతీలకు సమాంతరంగా పుట్టుకొచ్చిన సచివాలయాలపైనే అంతులేని అప నమ్మకాలు ఉన్నాయి. వాటి పుట్టుకపైనే అనేక సందేహాలున్నాయి. గ్రామ, వార్డు సచివాయాలకు అస్సలు చట్టబద్ధత లేదు. అర్డినెన్స్ తెచ్చారు.. కానీ చట్టం చేయలేదు. దీంతో అది చెల్లని కాసా.. లేకుంటే అతేంద్రియమైన శక్తా అన్నది స్పష్టత లేదు. గ్రామ పంచాయతీ నిధులను సచివాలయాలకు ఎలా మళ్లిస్తారన్నదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్న. రాజ్యంగబద్ధమైన స్థానిక సంస్థల నుంచి రాజకీయ సమాంతర వ్యవస్థలకు బదలాయింపుల వెనుక అసలు కథ ఏంటన్నది అంతుపట్టడం లేదు. నివృత్తి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, పాలకులు గ్రామస్వరాజ్యం కథ చెప్పి ప్రజలను సంతృప్తి పరుస్తున్నారు. బలవంతంగా గొంతు నొక్కుతున్నారు.
జనసేనాని పవన్ వలంటీర్లతో పాటు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై సూటిగా సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. అసలు పంచాయతీల స్థానంలో సచివాలయాలను ఎందుకు పెట్టారు? పంచాయతీలను ఎందుకు అచేతనం చేస్తున్నారు. పంచాయతీ ప్రథమ పౌరుడి హక్కులను ఎందుకు హరిస్తున్నారు? సమాంతర రాజకీయ వ్యవస్థకు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? వలంటీర్లకే మనోభావాలా? సర్పంచ్ లకు ఉండవా? ఇలా ఎన్నెన్నో అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన గురుతర బాధ్యత జగన్ సర్కారుపై ఉంది. లేకుంటే అది ప్రజాస్వామ్య విలువలకే ప్రమాదకరంగా నిలిచే అవకాశం ఉంది.