https://oktelugu.com/

Operation Akarsh : నాయకులు టిడిపిలోకి.. క్యాడర్ జనసేనలోకి.. వైసీపీని దెబ్బ కొట్టే పనిలో చంద్రబాబు, పవన్!

వైసీపీని దెబ్బ కొట్టే భారీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు చంద్రబాబు, పవన్. ఈ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. అందుకే మిగిలిన ఆ కొద్దిపాటి నాయకత్వాన్ని, క్యాడర్ను తమ వైపు తిప్పుకునేందుకు ఆ ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 27, 2024 / 01:36 PM IST
    Follow us on

    Operation Akarsh : ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ కు టిడిపి సిద్ధమవుతోందా? సభ్యత్వ నమోదు తో క్షేత్రస్థాయిలో జనసేన బలం పెంచుకోనుందా?ఈ రెండు పార్టీలు ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేయనున్నాయా? క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉన్న టిడిపి నాయకులను.. గ్రౌండ్ లెవెల్ లో బలపడాలనుకుంటున్న జనసేన వైసీపీ క్యాడర్ ను లాక్కునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఏపీలో కూటమి ఏకపక్ష విజయం సాధించింది. అయినా సరే వైసీపీకి ఇంకా బలం ఉంది. రాజ్యసభలో 11 మంది ఎంపీలు, లోక్సభలో నలుగురు, అసెంబ్లీలో 11మంది, మండలిలో 38 మంది, అన్ని జిల్లాల్లో జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పిటిసిలు.. నగరపాలక సంస్థ మేయర్లు, కార్పొరేటర్లు.. మునిసిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు.. ఇలా వైసీపీకి సంస్థాగత బలం ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 40 శాతం ఓట్లు రావడానికి ఈ బలమే ప్రధాన కారణం. అయితే నాయకులపరంగా టిడిపి, క్యాడర్ పరంగా జనసేన.. వైసీపీ శ్రేణులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. టిడిపికి సంబంధించి లోకేష్, జనసేన కు సంబంధించి నాగబాబు ఈ ప్రత్యేక ఆపరేషన్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు పెద్ద ఎత్తున టిడిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలకు సంబంధించి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పిటిసి లను జనసేనలో చేర్చుకొని క్షేత్రస్థాయిలో బలపడాలన్నది వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే శాసనమండలి వైస్ చైర్మన్ తో పాటు పలువురు ఎమ్మెల్సీలు లోకేష్ ను కలిశారు. టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు.

    * చేరికల విషయంలో జాగ్రత్తలు
    అయితే పార్టీల్లో చేరికల విషయంలో టిడిపి, జనసేన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వైసిపి హయాంలో రెండు పార్టీల శ్రేణులపై వేధింపులకు పాల్పడిన నాయకుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని డిసైడ్ అయ్యాయి. చాలామంది వైసిపి నేతలు అప్పట్లో టిడిపి, జనసేన శ్రేణులపై దాడులకు ఉపక్రమించారు. కేసులు పెట్టి వేధించారు. అటువంటి వారిని చేర్చుకోకూడదని ఆ రెండు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి.

    * ఓటింగ్ శాతాన్ని తిప్పుకునేందుకు..
    కూటమిలో తెలుగుదేశం పార్టీకి సంస్థగతంగా బలం ఉంది. 40కుపైగా ఓటింగ్ శాతం ఉంది. ఈ విషయంలో జనసేన వెనుకబడి ఉంది. అందుకే క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. వైసిపి ఓటింగ్ శాతాన్ని ఎలాగైనా టర్న్ చేసుకోవాలని చూస్తోంది. అందుకే ద్వితీయశ్రేణి నాయకత్వం పై దృష్టి పెట్టింది. వారి ద్వారా బలపడాలని నిర్ణయం తీసుకుంది. అందుకే నేతలను టిడిపిలోకి పంపించి.. క్యాడర్ను మాత్రం జనసేనలోకి పంపించాలన్నది వ్యూహంగా తేలుతోంది. తద్వారా వైసిపిని కోలుకోలేని దెబ్బతీయవచ్చని ఆ రెండు పార్టీలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

    * చట్ట సవరణకు రెడీ
    స్థానిక సంస్థలకు సంబంధించి.. అవిశ్వాస తీర్మానాలకు నాలుగు సంవత్సరాలు పూర్తి కావాల్సి ఉంది. నాలుగు సంవత్సరాలు గడిస్తే కానీ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. జగన్ సర్కార్ అప్పట్లో ప్రత్యేక చట్టం చేసింది దీనిపై. అందుకే చట్ట సవరణ చేసి అవిశ్వాస తీర్మానం గడువును ముందుకు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలోని మెజారిటీ స్థానిక సంస్థలు కూటమి పార్టీల స్వాధీనంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే నాయకత్వం టిడిపిలోకి.. క్యాడర్ జనసేనలోకి అన్న ఫార్ములా ఆకట్టుకుంటుంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.