Ongole IIIT: కొన్నేళ్లుగా ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యావిధానాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయి. ఇక ఇప్పటికే మంజూరైన విద్యా సంస్థలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నా.. ఏటా వాటికి లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తున్న పాలకులు సొంత భవన నిర్మాణాలపై నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) పరిస్థితి ఇదే. 2016లో స్థాపించబడ్డా, తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా స్థిరమైన క్యాంపస్ లేకపోవడం విద్యార్థుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోంది. కొత్త క్యాంపస్ కనిగిరిలో నిర్మించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇది కూడా వివాదాస్పదంగా మారింది.
తాత్కాలిక క్యాంపస్‌లో ఇబ్బందులు..
విద్యార్థులు ఆరేళ్ల కోర్సులో చేరినా, ప్రతి సంవత్సరం క్యాంపస్ మారాల్సి వస్తోంది. ప్రస్తుతం నాలుగు లీజు కాలేజీల్లో క్లాసులు జరుగుతున్నాయి. డిపార్ట్మెంట్, సంవత్సరం ఆధారంగా జరిగే మార్పులు లగేజీ భారం, అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి.
కనిగిరిలో సొంత భవనం..
ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించిన కొత్త భవనం కనిగిరిలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలల క్రితం ప్రభుత్వం కనిగిరిలో కొత్త క్యాంపస్‌కు రూ.560 కోట్ల బడ్జెట్ కేటాయించి, మొదటి విడతగా రూ.150 కోట్లు విడుదల చేసింది. అయితే దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల వ్యతిరేకత ఎందుకు?
కనిగిరి ఒంగోలు నగరానికి దూరంలో ఉండటంతో అక్కడకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. ఒంగోలు నగరంలోనే క్యాంపస్ నిర్మించాలని కోరుతున్నారు. తల్లిదండ్రులు కూడా నగరానికి దగ్గరగా ఉంటే అన్నివిధాలా సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఎమర్జెన్సీ సమయాల్లో మెడికల్ సౌకర్యాలకు ఇబ్బంది పడతారని ఆందోళన. పట్టణ సమీపంలోనే క్యాంపస్ కావాలని కోరుతున్నారు.
అధికారుల వాదన మరోలా..
అధికారులు కనిగిరిలో విశాలమైన మైదానాలు, భవనాలు, తరగతి గదులు నిర్మించవచ్చని, హైవే కనెక్టివిటీతో సమస్యలు ఉండవని చెబుతున్నారు. అయితే కొత్త భవనాన్ని వ్యతిరేకిస్తున్నవారిలో కొంత మందే ఉన్నారు.
విద్యార్థుల సమస్యలను విద్యాశాఖ మంత్రి లోకేశ్ గుర్తించి, ఒంగోలు సమీపంలోనే క్యాంపస్ ప్రాధాన్యత ఇవ్వాలి. స్థిరత్వం లేకపోతే అడ్మిషన్లపై ప్రభావం పడుతుంది. బడ్జెట్ వాగ్దానాలు సమయానుకూలంగా అమలు చేస్తే విశ్వాసం పెరుగుతుంది.