TDP disciplinary committee: తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party)ఒక విషయంలో సీరియస్ గా ఉంది. అదే కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని మధ్య ఎపిసోడ్ ను ముగించాలని భావిస్తోంది. రేపు క్రమశిక్షణ కమిటీ ఎదుట ఆ ఇద్దరు హాజరుకానున్నారు. ఒకరు కాకుంటే ఇద్దరినీ సాగనంపేందుకు పార్టీ హై కమాండ్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రేపు క్రమశిక్షణ కమిటీ ఎదుట వారిచ్చే సమాధానం, బహిరంగ ఆరోపణలపై ఆధారాలు సమర్పించడం, వారి వ్యవహార శైలి నివేదిక వచ్చాక నాయకత్వం చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. ఇలానే ఉపేక్షిస్తే ఇది వైరస్లా విస్తరిస్తుందని.. వారితో సన్నిహితంగా ఉన్న వారికి సైతం ఇది అంతగాకుతోందని నాయకత్వం భావిస్తోంది. అందుకే ఈ ఎపిసోడ్ కు కఠిన చర్యల ద్వారా ముగింపు ఇచ్చి.. మిగతా నేతలకు సైతం సంకేతాలు పంపాలని చూస్తోంది.
రేపు క్రమశిక్షణ కమిటీ ఎదురుగా..
కొద్ది రోజుల కిందట విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పై.. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. తనకు అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు ఐదు కోట్లు వసూలు చేశారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. విడతలవారీగా.. స్నేహితుల ద్వారా తాను అందించిన మొత్తాన్ని వివరించే ప్రయత్నం చేశారు. దీంతో ఇది ప్రకంపనలకు దారితీసింది. ఈ నేపథ్యంలో అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక అందించాలని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసును ఆదేశించారు. దీంతో వారిద్దరూ వేర్వేరుగా క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు అందాయి. రేపు క్రమశిక్షణ కమిటీ ఎదుట వేర్వేరుగా ఆ ఇద్దరు నేతలు హాజరు కానున్నారు.
సమన్వయం చేసుకోలేక..
తిరువూరు ఎమ్మెల్యే పై వివాదాస్పద అంశాలు బయటకు రావడంతో.. ఆ నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ చిన్నికి అప్పగించింది నాయకత్వం. కానీ ఆయన సరిగ్గా హేండిల్ చేయలేకపోయారు. ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఉన్న కొలికపూడిని సమన్వయం చేయకుండా ముందుకెళ్లారు. పైగా రెచ్చగొట్టే ధోరణి సాగింది. దీంతో ఎమ్మెల్యే శ్రీనివాసరావు తిరుగుబాటు చేశారు. అయితే ఎమ్మెల్యే శ్రీనివాసరావు బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ చిన్ని మాత్రం బయటకు మాట్లాడలేదు. అందుకే ఎమ్మెల్యే కొలికపూడి పై వేటు పడే అవకాశం ఉంది. విజయవాడ ఎంపీ కేసినేని చిన్నికి తిరువూరు బాధ్యతలనుంచి తప్పించే ఛాన్స్ కనిపిస్తోంది. అవసరం అనుకుంటే ఇద్దరిపై కూడా చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. తద్వారా క్రమశిక్షణ విషయంలో పార్టీ హైకమాండ్ కఠినంగా ఉందన్న సంకేతాలు పంపించనుందన్నమాట.