https://oktelugu.com/

AP Elections 2024: అక్కడ తమిళ ఓటర్లే ‘కీ’లకం

చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దులో ఉంది. ఈ జిల్లాకు చెందిన లక్షలాదిమంది వివిధ కారణాలతో చెన్నై తో పాటు వేలూరు, కోయంబత్తూరు, అంబురు, సేలం క్రిష్ణగిరి హోసూర్ తో పాటు తమిళనాడులోని వివిధ జిల్లాల్లో నివాసం ఉంటున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 13, 2024 4:11 pm
    AP Elections 2024

    AP Elections 2024

    Follow us on

    AP Elections 2024: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు తమిళ ఓటర్లు కీలకంగా మారారు. సరిహద్దు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో వారు ఉన్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తమిళ ఓటర్ల ప్రభావం అధికం. ఓ రెండు నియోజకవర్గాల్లో అయితే వారే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు. మంచి దూకుడు మీద ఉండే మంత్రి రోజా నగిరి లో గెలవాలంటే వారి మద్దతు తప్పనిసరిగా అవసరం. గత రెండు ఎన్నికల్లో ఆమె గెలిచేందుకు తమిళ ఓటర్లు దోహదపడ్డారు. ఆమె భర్త సెల్వమణి తమిళ దర్శకుడు కావడంతో రోజాకు కలిసి వచ్చింది. అయితే ఈసారి తమిళ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు అన్నది కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

    చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దులో ఉంది. ఈ జిల్లాకు చెందిన లక్షలాదిమంది వివిధ కారణాలతో చెన్నై తో పాటు వేలూరు, కోయంబత్తూరు, అంబురు, సేలం క్రిష్ణగిరి హోసూర్ తో పాటు తమిళనాడులోని వివిధ జిల్లాల్లో నివాసం ఉంటున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన లక్షలాదిమంది తమిళనాడులో వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తుంటారు. వీరి ఓట్లు మాత్రం చిత్తూరు జిల్లాలోనే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ ఓటర్ల ప్రభావం ఈ ఎన్నికల్లో ఉంది. ప్రధానంగా చిత్తూరు, కుప్పం, పలమనేరు, నగిరి, జీడి నెల్లూరు, సత్యవేడు, తిరుపతి నియోజకవర్గాల్లో చాలామంది తమిళం మాట్లాడుతుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తరువాత లక్షలాదిమంది తమిళులు ఏపీలో స్థిరపడిపోయారు.

    ఏపీలో ఉన్న తమిళ మూలాలు మాత్రం ఎక్కువ మంది మరిచిపోలేదు. అయితే చిత్తూరు జిల్లాలో కీలక నేతలు గెలవాలంటే వీరి మద్దతు అవసరం. మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగిరి లో 55,000 మంది తమిళ ఓటర్లు ఉన్నారు. గతంలో రెండు సార్లు రోజా తమిళ ఓటర్ల పుణ్యమా అంటూ ఎమ్మెల్యేగా గెలిచారు. అందుకే ఈసారి ఎన్నికల్లో గెలిచేందుకు తమిళ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నించారు రోజా. ఈ క్రమంలో తమిళమే మాట్లాడారు. అయితే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో సైతం 20 వేల మంది తమిళ ఓటర్లు ఉన్నారు. జీడి నెల్లూరులో అయితే 55,000 మంది తమిళ్ ఓటర్లు కీలకంగా మారారు. సత్యవేడులో అయితే ఏకంగా 65 వేల మంది తమిళ ఓటర్లు ఉండడం విశేషం. అందుకే ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు సైతం తమిళంలోనే మాట్లాడి ఓటర్లను అభ్యర్థించారు. ఈసారి చిత్తూరు జిల్లాలో తమిళ ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారడం విశేషం.