చంద్రబాబుకు సిబిఐ కేసులు తప్పవా?

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. టీడీపీ నేతల వరుస అరెస్టులు చూస్తుంటే భవిష్యత్ లో జరిగేది ఇదే అనిపిస్తుంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మొదటి ఏడాది సీఎం జగన్ పాలనపై పట్టు సాధించడం, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుపైనే దృష్టి సారించారు. ఏడాది పాలన ముగిసిన అనంతరం గత ప్రభుత్వం లో జరిగిన అవినీతిని తవ్వుతున్నారు. వైసీపీ అధికారంలోకి రాక ముందు నుంచే టీడీపీ […]

Written By: Neelambaram, Updated On : June 14, 2020 2:47 pm
Follow us on

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. టీడీపీ నేతల వరుస అరెస్టులు చూస్తుంటే భవిష్యత్ లో జరిగేది ఇదే అనిపిస్తుంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మొదటి ఏడాది సీఎం జగన్ పాలనపై పట్టు సాధించడం, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుపైనే దృష్టి సారించారు. ఏడాది పాలన ముగిసిన అనంతరం గత ప్రభుత్వం లో జరిగిన అవినీతిని తవ్వుతున్నారు. వైసీపీ అధికారంలోకి రాక ముందు నుంచే టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి కార్యక్రమాలపై తాము అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ జరిపిస్తామని చెబుతూ వస్తోంది.
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించింది. అనంతరం ఈ విషయంలో ఎటువంటి చర్యలు లేకపోవడంతో టీడీపీ నేతలు సైతం పెద్దగా పట్టించుకోలేదు. శాసన సభలో చర్చల సందర్భంగా అవినీతి విషయంలో వైసీపీ టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసినప్పుడు విచారణ చేయించుకోవాలని టీడీపీ సవాల్ విసిరిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
అయితే వైసీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదు. పక్క వ్యూహం తోనే ముందుకు వెళుతుంది. ఇ ఎస్ ఐ, బిఎస్-3 వాహనాల స్కామ్ ల విచారణ పూర్తి కావడంతో, ఫైబర్ గ్రిడ్, చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా  పథకాలపై ఇటీవలే మంత్రివర్గ ఉపసంఘం అవినీతి నిర్ధారిస్తూ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. సిబిఐ విచారణకు కేబినెట్ ఆదేశించింది. ఇక్కడితో ఈ అంకం పూర్తి కాలేదు. రానున్న రోజుల్లో అమరావతిలో భూముల కేటాయింపు కుంభకోణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, నీరు-చెట్టు కార్యక్రమంలో అవినీతిపై సిబిఐ విచారణలు తప్పవని సమాచారం.
వైసీపీ నాయకులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.  అచ్చెన్నాయుడు, ప్రభాకరరెడ్డి అరెస్టులు టీడీపీ అవినీతిపై చర్యల్లో ఇది తొలి అడుగే అంటూ సీఎం సలహాదారు సజ్జల రామకృషారెడ్డి ట్వీట్ చేశారు. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని విచారణ ఎదుర్కొనేందుకు టీడీపీ నేతలు సిద్ధం కావాల్సిన పరిస్థితి తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని భూముల కేటాయింపు విషయంలో సీఆర్డీఏ ఛైర్మన్ గా అన్ని వ్యవహారాలు సీఎం చంద్రబాబు చూసుకున్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా కళా వెంకట్రావు బాధ్యతలు తీసుకునే వరకూ కొన్నేళ్లపాటు విద్యుత్ శాఖను సీఎం చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు. ఈ సమయంలోనే కీలక విద్యుత్ ఒప్పందాలు జరిగాయి. వెంకట్రావు భాద్యతలు తీసుకున్నా చంద్రబాబుకు తెలియకుండా ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అదేవిధంగా పోలవరం, నీరు -చెట్టు కార్యక్రమంలో భారీస్థాయిలో అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి, బిజెపి నాయకులు ఈ అంశంలో కేంద్రానికి  ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సిబిఐ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి అవసరం కనిపిస్తోందని రాజకీయ విశేషకులు అంటున్నారు.