Raghurama Krishnam Raju: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వైసిపి పై గట్టి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన ఆరు నెలలకే పార్టీకి దూరమయ్యారు. వైసీపీకి రెబల్ గా మారారు. గోకరాజు గంగరాజు కుటుంబం వైసీపీలో చేరడం, హై కమాండ్ తనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం, విజయసాయిరెడ్డి పెత్తనం పెరగడం వంటి కారణాలతో రఘురామ కృష్ణంరాజు వైసీపీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా వైసీపీ నాయకత్వంపై విరుచుకుపడుతూ వస్తున్నారు. అటు జగన్ సైతం రఘురామరాజు పై కేసులు నమోదు చేయడమే కాదు సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా చేశారు. దానికి బదులు తీసుకోవాలని రఘురామ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా గెలుపొంది సత్తా చాటాలని చూస్తున్నారు.
ప్రస్తుతం రఘురామ మూడు పార్టీలకు అనుకూలంగా ఉన్నారు. జాతీయస్థాయిలో బిజెపితో, రాష్ట్రంలో టిడిపి, జనసేనకు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నారు. ఆ మూడు పార్టీలను ఒకే తాటి పైకి తేవడానికి రఘురామకృష్ణం రాజు చాలా వరకు ప్రయత్నించారు. ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలవడంతో తాను అనుకున్నది సాధించి తీరుతానని రఘురామ భావిస్తున్నారు. కానీ ఆయన ఆశలపై బిజెపి హై కమాండ్ నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. నరసాపురం నుంచి బిజెపి కొత్త అభ్యర్థిని బరిలో దించనున్నట్లు సమాచారం. ఇది రఘురామకృష్ణం రాజుకు కలవరపాటుకు గురి చేసే అంశం.
బిజెపికి బలమైన నియోజకవర్గంలో నరసాపురం పార్లమెంట్ స్థానం ఒకటి. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి కృష్ణంరాజు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఒకవేళ టిడిపి, జనసేనతో పొత్తు కుదిరితే బిజెపి కోరుకునే స్థానం ఇది ఒకటి. ఇప్పటికే పొత్తు కుదిరిపోయిందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ స్థానం బిజెపికి కేటాయిస్తారని టాక్ నడుస్తోంది. అదే జరిగితే బిజెపిలో చేరి రఘురామకృష్ణంరాజు ఎంపీ టికెట్ దక్కించుకుంటారని అంతా భావించారు. కానీ ఇక్కడే ట్విస్ట్. తెరపైకి పాక వెంకట సత్యనారాయణ అనే నేత పేరు బయటకు వచ్చింది. ఆయనే బిజెపి అభ్యర్థి అవుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో రఘురామకృష్ణంరాజు ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు తెలుస్తోంది.
బిజెపి అగ్రనాయకత్వం దగ్గర రఘురామకృష్ణంరాజుకు మంచి పేరు ఉంది. అగ్ర నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో తనకు నరసాపురం ఎంపీ టికెట్ ఖాయమని రఘురామకృష్ణంరాజు భావించారు. అయితే వైసిపి హై కమాండ్ ఇప్పటికే శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత పేరును ప్రకటించింది. దీంతో బిజెపి పునరాలోచనలో పడింది. పైగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీ అభ్యర్థులను బరిలో దించాలని నిర్ణయించుకుంది. అందుకే నరసాపురంలో వైసీపీకి ధీటుగా బీసీ అభ్యర్థిని రంగంలో దించాలని చూస్తోంది. పాక వెంకట సత్యనారాయణ అనే గౌడ నేత పేరును పరిశీలిస్తోంది. మొన్న ఆ మధ్యన బిజెపి ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. దీంతో వెంకట సత్యనారాయణ దరఖాస్తు చేసుకున్నారు. ఆయన నుంచి హై కమాండ్ వివరాలు సేకరించినట్లు సమాచారం. ఇప్పుడది రఘురామకృష్ణ రాజుకు కొత్త తలనొప్పిగా మారింది. ఇటువంటి సమయంలో బిజెపి టికెట్ రఘురామకృష్ణంరాజుకు దక్కుతుందా? లేదా? అన్నది చూడాలి.