New Corona Variant in AP : ఏపీలో( Andhra Pradesh) తొలిసారిగా కొత్త వేరియంట్ కరోనా కేసు నమోదు అయింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చైనా, హాంకాంగ్, సింగపూర్ లో కేసుల తీవ్రత అధికంగా ఉంది. ప్రతిరోజు వేలాది కేసులు నమోదవుతున్నాయి. తాజాగా భారతదేశంలో సైతం కేసుల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో తొలి కేసు నమోదయింది. విశాఖ నగరంలో వెలుగు చూసింది. మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన ఓ వివాహిత మహిళ కోవిడ్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు పాజిటివ్ గా రావడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో భర్త ఇద్దరు పిల్లలకు కూడా తక్షణ పరీక్షలు నిర్వహించారు. ఆ కుటుంబాన్ని హోమ్ క్వారంటైన్ లో ఉంచారు.
* సెకండ్ వేవ్ లో ప్రమాదం
2019లో కోవిడ్ ( kovid )వ్యాప్తి ప్రారంభమైంది. ప్రపంచం అతలాకుతలం అయింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. 2020లో సెకండ్ వేవ్ తో వైరస్ తీవ్రత పతాక స్థాయికి చేరింది. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ జరగడంతో క్రమేపి వైరస్ తగ్గుముఖం పట్టింది. ఏటా ఈ సమయానికి కొత్త వేరియంట్ రూపంలో వైరస్ కనిపిస్తోంది. అయితే అది అంతగా ప్రభావం చూపడం లేదు. ఈ ఏడాది కూడా ఇప్పుడు కొత్త వేరియంట్ ప్రారంభం అయింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : ఏపీలో కరోనా విలయమే.. రోజుకు 13వేల కేసులు.. లక్ష దాటిన యాక్టివ్ కేసులు
* వైద్య ఆరోగ్యశాఖ కీలక సూచనలు
కోవిడ్ మళ్ళీ విజృంభించకుండా అడ్డుకునేందుకు.. రాష్ట్ర ఆరోగ్య శాఖ కొన్ని ముఖ్య సూచనలు విడుదల చేసింది. అందులో భాగంగా ప్రార్థనలు, వివాహాలు, పార్టీలు, ఇతర సామూహిక కార్యక్రమాలను తాత్కాలికంగా ఆపాలని సూచించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కనీస నిబంధనలను తప్పనిసరి చేసింది. మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడడం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఇళ్లలోనే ఉండాలని సూచనలు ఇచ్చింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ల్యాబ్ లలో 24 గంటల పాటు పరీక్షలు అందుబాటులో ఉండేలా ఆదేశాలు ఇచ్చింది. మాస్కులు, పిపిఈ కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్కులు తగిన మోతాదులు నిల్వ చేసుకోవాలని ఆయా జిల్లాల యంత్రాంగాలకు ఆదేశాలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.