Jagan: ఏపీలో( Andhra Pradesh) తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తీవ్ర వాయుగుండం ప్రళయ భీకరంగా మారింది. ఈరోజు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వర్షాలు దంచి కొడుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇటువంటి తరుణంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు తుఫాన్ నష్టం పై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అయితే సర్వం సిద్ధంగా ఉంది. బాధిత జిల్లాలకు ముందుగానే కోటి రూపాయల చొప్పున మంజూరు చేశారు. ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందిస్తూ అప్రమత్తం చేశారు. రాష్ట్రం ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
Also Read: ప్రమాదపుటంచున ఏపీ.. దూసుకొస్తున్న ‘మొంథా’!
* వారంలో నాలుగు రోజులు అక్కడే..
ప్రస్తుతం బెంగళూరులో ( Bangalore)ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. వారంలో మూడు రోజులపాటు తాడేపల్లి లో ఉంటున్నారు. నాలుగు రోజులు మాత్రం బెంగళూరు ప్యాలెస్ లో గడుపుతున్నారు. అయితే ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని బెంగళూరు వచ్చారు. అక్కడ దీపావళి జరుపుకున్నారు. తాడేపల్లి కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు భారీ తుఫాన్ నేపథ్యంలో తాడేపల్లి కి వచ్చి ప్రభుత్వ వైఫల్యాలు పై మాట్లాడేందుకు సిద్ధపడ్డారు. కానీ బెంగళూరు నుంచి గన్నవరం వచ్చే విమానాలు రద్దు అయ్యాయి. దీంతో బెంగళూరులోనే జగన్ ఉండి పోవాల్సి వచ్చింది.
* బెంగళూరులోనే జగన్
ఒకవైపు తుఫాను( cyclone) సహాయ చర్యల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. అన్ని విధాల సంసిద్ధులను చేసింది ప్రభుత్వం. డిజాస్టర్ మేనేజ్మెంట్లో చంద్రబాబు ముందస్తు ఆలోచన చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. గత అనుభవాల దృష్ట్యా ముందుగానే మేల్కొన్నారు. తుఫాను ప్రభావిత జిల్లాలకు కోటి రూపాయల చొప్పున ముందుగానే కేటాయించారు. మిగతా జిల్లాలకు సైతం అత్యవసర సహాయ నిధి కింద 50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. అయితే తాడేపల్లికి వచ్చి తుఫాను సహాయ చర్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చూసారు జగన్. కానీ ప్రకృతి ఆయనకు సహకరించలేదు. ఏకంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో బెంగళూరులోనే ఉండి పోవాల్సి వచ్చింది జగన్. అయితే రాష్ట్రం ఇక్కట్లలో ఉంటే అధినేత బెంగళూరులో ఉండడం పై సొంత పార్టీ శ్రేణులే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.