National media on Lokesh: సాధారణంగా ఏపీ నుంచి ముఖ్యమంత్రి( chief minister) స్థాయి నాయకులు ఢిల్లీలో అడుగుపెడితే మీడియా అటెన్షన్ ఉంటుంది. ప్రధాని అపాయింట్మెంట్ ఇట్టే లభిస్తుంది. అయితే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో అడుగుపెట్టిన మరుక్షణం ముఖ్యమంత్రి స్థాయిలో గౌరవం లభిస్తుంది. నేషనల్ మీడియా సైతం ఎంతగానో ప్రాధాన్యమిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ సైతం కలిసేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇట్టే అపాయింట్మెంట్ లభిస్తుంది లోకేష్ కు. అయితే లోకేష్ విషయంలో మారిన ఈ వైఖరి మాత్రం ఢిల్లీ వర్గాల్లో కొత్త ప్రచారానికి తెర తీస్తోంది. ఒక పద్ధతి ప్రకారమే లోకేష్ ప్రాధాన్యత పెరుగుతున్నట్లు అర్థమవుతోంది. గతంలో మంత్రి స్థాయి నేతకు ఇటువంటి ప్రాధాన్యత దక్కిన సందర్భాలు లేవు.
గతానికి భిన్నంగా..
రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. గతంలో ఇదే లోకేష్( Nara Lokesh) ఢిల్లీ పెద్దలను కలుసుకునేందుకు ఆపసోపాలు పడ్డారు. చంద్రబాబు అరెస్టు సమయంలో లోకేష్ ఢిల్లీ బాట పట్టారు. ఆ సమయంలో కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కూడా లభించలేదని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం అదే లోకేష్ కు బిజెపి పెద్దలు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పంపుతున్నారు. అంటే భవిష్యత్తులో లోకేష్ ప్రాధాన్యతను గుర్తించి కేంద్ర పెద్దలు గౌరవిస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే సీఎం చంద్రబాబు కుమారుడిగా కంటే.. లోకేష్ కు ఇప్పుడు ప్రత్యేకంగా తనకంటూ ఒక గుర్తింపు ఉంది. అయితే తన పనితనంతో పాటు పనితీరును మెరుగుపరుచుకుని ఈ స్థాయికి వచ్చారు లోకేష్.
రాజధాని లో బిజీ బిజీ..
ప్రస్తుతం ఢిల్లీలో( Delhi) బిజీగా ఉన్నారు నారా లోకేష్. ఢిల్లీ పర్యటన నిమిత్తం ఆయన రాజధాని లో అడుగు పెట్టారు. పార్లమెంట్ ప్రాంగణంలో సైతం హల్చల్ చేశారు. నేషనల్ మీడియా సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. లోకేష్ కు ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. సహజంగానే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని విషయం. ఒక్కమాటలో చెప్పాలంటే లోకేష్ కు ఇంత ప్రాధాన్యం వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అస్త్రం ఉంది. ఎందుకంటే ఆ పార్టీ లోకేష్ విషయంలో చేయని అవమానం అంటూ లేదు. దానివల్లే ఆయన జాతీయ స్థాయిలో కూడా హైలెట్ అయ్యారు.
చంద్రబాబుకు మించి జోష్..
అయితే ఇప్పుడు లోకేష్ జోరు చూస్తుంటే మాత్రం చంద్రబాబుకు మించి అన్నట్టు ఉంది పరిస్థితి. 1995లో టిడిపి సంక్షోభంలో పార్టీతో పాటు ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు చంద్రబాబు. అప్పటినుంచి వెన్నుపోటు అనే ముద్ర వెంటాడింది చంద్రబాబును. కానీ దానిని అధిగమించారు చంద్రబాబు. జాతీయస్థాయిలో సైతం తనదైన ముద్ర చాటుకున్నారు. జాతీయ రాజకీయాల్లో సైతం రాణించారు. అచ్చం తండ్రి మాదిరిగానే ఇప్పుడు జాతీయ రాజకీయాలపై కూడా నారా లోకేష్ ప్రభావం చూపగలుగుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఎదుగుతున్న తీరు మాత్రం నిజంగా అభినందించ తగ్గది.