Nara Lokesh: ఒక మనిషికి తలకాయ ఎలాంటిదో.. అతని నోటి నుంచి వచ్చే మాట కూడా అలాంటిదే. అందుకే నోరు అదుపు.. మాట పొదుపు అని పెద్దలంటారు. కానీ ఇలా మాట్లాడే విషయంలో ఏ మాత్రం తప్పు దొర్లినా అర్థం మారిపోతుంది. జనాల ముందు చులకన కావాల్సి వస్తుంది. అసలే ఈ స్మార్ట్ ప్రపంచంలో మనం మాట్లాడే ప్రతి మాటకు ఒక విలువ ఉంటుంది. ఆ విలువకు తగ్గట్టుగానే మనం మాట్లాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకుంటే అంతే సంగతులు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం ఇటువంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ పదవికి వన్నె తేవాల్సిన ఆయన.. వచ్చిరాని తెలుగు మాట్లాడి అభాసుపాలవుతున్నారు. తన పార్టీ పేరు తెలుగుదేశం అయినప్పటికీ.. తెలుగులో స్పష్టంగా మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆయన ఒక సభలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ మాట్లాడారు..”సీనియర్ ఎన్టీఆర్ మనకు దేవుడు. చంద్రబాబు నాయుడు రాముడు. కానీ ఈ లోకేష్ వైకాపా నాయకులకు మూర్ఖుడు” అని అన్నారు. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వాస్తవానికి వైకాపా నేతలకు మొగుడు అనాల్సింది పోయి మూర్ఖుడు అని అనేశాడు. దీంతో అక్కడున్న టిడిపి నాయకులు ఒక్కసారిగా నిశ్చేష్టులై పోయారు. కొంతమంది నాయకులు వారిస్తున్నప్పటికీ నారా లోకేష్ మూర్ఖుడు అనే మాటను పదేపదే వ్యాఖ్యానించారు. వాస్తవానికి నారా లోకేష్ విదేశాలలో చదువుకోవడం వల్ల ఆయన తెలుగు అంత స్పష్టంగా ఉండదు.. గతంలో ఆయన పలు సందర్భాల్లో జరిగిన సమావేశాలలో చేసిన ప్రసంగాలలో తప్పు అర్థం వచ్చేలా మాట్లాడారు. అసలే ఇది సోషల్ మీడియా కాలం కాబట్టి వైసిపి నాయకులు నారా లోకేష్ చేసిన ప్రసంగాలను తెగ సర్క్యూలేట్ చేశారు.
ఇక ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో నారా లోకేష్ పలు సమావేశాల్లో తప్పుగా మాట్లాడిన ప్రసంగాలను వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ చేస్తున్నారు. నారా లోకేష్ మాట్లాడిన మాటలను వ్యంగ్యంగా చిత్రీకరిస్తున్నారు. వైసిపి సోషల్ మీడియా విభాగం నాయకులకు పోటీగా టిడిపి సోషల్ మీడియా విభాగం నాయకులు స్పందిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి వివిధ సమావేశాల్లో తప్పుగా మాట్లాడిన మాటల తాలూకూ వీడియోలను కౌంటర్ గా పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఎన్నికలకు ముందే అటు వైసిపి, ఇటు టిడిపి నాయకులు సోషల్ యుద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందే ఇలా ఉంటే.. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Nenu oka moorkudni
– @naralokesh pic.twitter.com/MSZpd6tPhY
— Chaitanya Reddy (@ltsChaitanya) February 11, 2024