Data center in Visakhapatnam: ఏపీ మంత్రి నారా లోకేష్( AP Minister Nara Lokesh) ఢిల్లీలో బిజీగా ఉన్నారు. గత రెండు రోజులుగా ఢిల్లీలోనే గడుపుతున్నారు. అందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, జేపీ నడ్డా, జై శంకర్, హర్దీప్ సింగ్ పూరి లతో నారా లోకేష్ సమావేశం అయ్యారు ఇటీవల సీఎం చంద్రబాబు బృందం సింగపూర్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో లోకేష్ సైతం ఉన్నారు. సింగపూర్లో కీలక కంపెనీలతో జరిగిన చర్చలు, వాటి పురోగతి గురించి విదేశాంగ మంత్రి జై శంకర్ తో చర్చించారు నారా లోకేష్. సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల సారాంశాన్ని కూడా వివరించారు.
విశాఖలో డేటా సెంటర్..
విశాఖను ఐటీ హబ్ గా ( IT hub) మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విశాఖకు చాలా రకాల కంపెనీలు వచ్చాయి. ఐటీ సంస్థలు కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నాయి. ఈ క్రమంలో విశాఖలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నారా లోకేష్ కోరారు. రాష్ట్రం నుంచి ఎంతోమంది యువత విదేశాల్లో కొలువుల కోసం వెళ్తుంటారని.. అలాంటివారికి సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ ఇచ్చేందుకుగాను విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని కేంద్రమంత్రిని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. విశాఖలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్ గా మారుతుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్రమంత్రి జై శంకర్ సానుకూలంగా స్పందించారు.అలాగే కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి హరిదీప్ సింగ్ పూరిని నారా లోకేష్ కలిసారు. ఏపీలో బీపీసీఎల్ సంస్థ నిర్మించే రిఫైనరీ కం మెట్రో కెమికల్ కాంప్లెక్స్ త్వరితగతిన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్!
కేంద్రం సానుకూలత..
ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం( central government) చాలా సానుకూలంగా ఉంది. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ నెలకొల్పుతామని ప్రకటించింది. అందుకే ఇప్పుడు ఆ సెంటర్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు మంత్రి నారా లోకేష్. ఈ ఏడాది ఫిబ్రవరిలో సైతం ఢిల్లీ పర్యటన సమయంలో ఇదే అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసే డేటా సిటీకి సహకరించడంతోపాటు ఏపీలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు ప్రాధాన్యం పెరుగుతుందని.. ఆ రంగంలో మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని ఏపీ ప్రభుత్వం నమ్మకంగా చెబుతోంది. అందుకే ఆ దిశగా చర్యలు చేపడుతోంది.