Nara Lokesh: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతోంది. మరో నెలలో రెండేళ్ల పాలన పూర్తవుతుంది. ఇప్పటివరకు సజావుగా పూర్తి చేసామన్న సంతృప్తి కూటమిలో ఉంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని చెబుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నిర్ణయాల దిశగా కూటమి ముందుకు వెళ్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. మంత్రి నారా లోకేష్ ప్రమోషన్, పట్టాభిషేకం వంటి ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇటువంటి తరుణంలో పవన్ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది చర్చ. ఒకవేళ లోకేష్ కు ప్రమోషన్ కల్పించాలంటే పవన్ నుంచి అభ్యంతరం రాదా? అనే చర్చ కూడా బలంగా సాగుతోంది. అయితే ఏది ఏమైనా మూడు పార్టీలు కలిసి ముందుకెళ్లాలని బలంగా నిర్ణయించుకున్నాయి. అందుకే కూటమి అంతర్గత నిర్ణయాలు సైతం మూడు పార్టీల మధ్య జరగాలన్నది ఒక ప్రతిపాదనగా ఉన్నట్లు తెలుస్తోంది.
* కొత్త ప్రచారం..
2027 ద్వితీయార్థంలో మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh) ప్రమోషన్ ఉంటుందన్న చర్చ నడుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తారని టాక్ నడుస్తోంది. కానీ ఇప్పటికే పార్టీ పై పూర్తిస్థాయిలో పట్టు సాధించారు లోకేష్. ఆపై తన మంత్రి పదవి విషయంలో సైతం సక్సెస్ అయ్యారు. పెట్టుబడుల సాధన, పరిశ్రమల ఏర్పాటు వంటి విషయంలో విజయం సాధించారు. తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. అదే సమయంలో బిజెపి అగ్ర నేతల ఆశీస్సులు కూడా అందుకున్నారు. వారి అభిమానాన్ని చూరగొన్నారు. అయితే ఏకంగా లోకేష్ కు ముఖ్యమంత్రి పదవి కట్ట పెడతారన్న ప్రచారం నడుస్తోంది. అయితే అంతటి సాహసానికి దిగుతారా అనేది చర్చ. ఎందుకంటే అమరావతి రాజధానిని ప్రాధాన్యత ప్రాజెక్టుగా తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థల ఏర్పాటు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధికార మార్పిడి జరిపితే దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అందుకే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని తెలుస్తోంది.
* పెరుగుతున్న పవన్ పరపతి..
రాష్ట్రంలో లోకేష్ ప్రమోషన్, పవన్ కళ్యాణ్ కు ప్రత్యామ్నాయ అవకాశాలు జరగాలంటే 2029 ఎన్నికల తరువాతే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీలో మంత్రిగా ఉన్నారు. ఆపై డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగుతున్నారు. మరోవైపు సనాతన ధర్మం అంటూ జాతీయ స్థాయిలో సైతం ప్రభావం చూపుతున్నారు. తరచూ వివిధ రాష్ట్రాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో సైతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో పవన్ కళ్యాణ్ ద్వారా రాజకీయం చేయాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. ఈ పరిస్థితులు చూస్తుంటే 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ లో కీలక బాధ్యతలు కట్టబెట్టి జాతీయస్థాయి రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ ను వాడుకుంటారు అన్న చర్చ జోరుగా సాగుతోంది.
* ఆ ఎన్నికలతోనే క్లారిటీ..
2029 సార్వత్రిక ఎన్నికలతో( general elections ) పార్టీ ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. మూడు పార్టీలు ఉమ్మడిగా ముందుకు వెళ్తాయి. పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారు. లోకేష్ తిరిగి అసెంబ్లీకి పోటీ చేస్తారు. కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందన్న నమ్మకం వారిలో ఉంది. అప్పుడు కూడా చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఖాయం. కేంద్రంలో పవన్ కళ్యాణ్ తిరుగులేని శక్తిగా ఉంటారు. ఏపీలో కూటమికి రక్షణ కవచంగా నిలుస్తారు. అటువంటి సమయంలో చంద్రబాబు వయసు దృష్ట్యా సీఎం పదవి నుంచి తప్పుకుంటే లోకేష్ కు పట్టాభిషేకం చేయడం ఖాయం. కేంద్ర పెద్దల భరోసాతో, పవన్ కళ్యాణ్ సమ్మతితో ఇది జరిగే అవకాశం ఉంది. అంటే రాష్ట్రంలో పదవుల మార్పు అనేది 2029 ఎన్నికల్లో విజయాలను అనుసరించి ఉంటుంది. అంతవరకు ఎటువంటి మార్పు ఉండదు అన్నది విశ్లేషకుల మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.