Nara Lokesh baby Punarvika treatment: “ఇది నువ్వు కాపాడిన బిడ్డ. కత్తికి బలి కాకుండా నువ్వు కాచిన బిడ్డ. నువ్వే దేవుడని మాకు చెప్పే అక్కర్లేదు. మమ్మల్ని నమ్మించే పనిలేదు. ఇది నీ దర్శనం. ఇది నిదర్శనం..” ఖలేజా సినిమాలో మహేష్ బాబు ఉద్దేశించి రావు రమేష్ పలికే డైలాగు ఇది.
ఒక మనిషి ప్రాణాన్ని తీయడం చాలా తేలిక. కానీ ప్రాణాలను నిలబెట్టడం చాలా కష్టం. ప్రాణాన్ని తీసిన వాడిని హంతకుడు అనే ఈ సమాజం.. ప్రాణాల్ని నిలబెట్టేవాడిని దేవుడు అని కొనియాడుతుంది. ఆ దంపతులకు.. వారి బిడ్డను కాపాడిన నారా లోకేష్ ఎప్పటికీ దేవుడే. వారి కళ్ళల్లో కనిపిస్తున్న కన్నీటి చారికలు భావోద్వేగానికి మాత్రమే కాదు.. నారా లోకేష్ కు తెలుపుతున్న గాడమైన కృతజ్ఞతలు..
ఆ పాప పేరు పునర్విక. అందరిలాగానే జన్మించింది. కాకపోతే అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA TYPE -1) వ్యాధితో బాధపడుతోంది. ఆ వ్యాధి నివారణకు ఉపయోగించే ఇంజక్షన్ ధర కోట్లల్లో ఉంటుంది. అయితే ఆ ఇంజక్షన్ కొనుగోలు చేసే స్థాయి ఆ దంపతులకు లేదు. దీంతో వారు నారా లోకేష్ ను సంప్రదించారు. పాప పరిస్థితిని గమనించిన ఆయన అమెరికా నుంచి ఇంజక్షన్ తెప్పించారు.. నారా లోకేష్ చేసిన సహాయం ద్వారా ఆ పాప ప్రాణాలు నిలిచాయి. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో రెయిన్బో పిల్లల ఆసుపత్రిలో ఆ పాపను నారా లోకేష్ పరామర్శించారు. పాప తల్లిదండ్రులతో మాట్లాడారు. అమెరికా నుంచి తీసుకొచ్చిన జోల్ జెన్ స్మా అన్న ఇంజక్షన్ ను ఆ పాపకు వేశారు.. జీన్ తెరపి ద్వారా ఆ చిన్నారికి ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి లోకేష్ ఆ పాప తల్లిదండ్రులతో మాట్లాడారు.. కాగా, ఆ ఇంజక్షన్ ధర 16 కోట్ల వరకు ఉంటుంది.
పునర్వికకు వచ్చిన వ్యాధి అత్యంత అరుదైనదని వైద్యులు చెబుతున్నారు. దీని ద్వారా వెన్నెముక తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. మనిషి అచేతనంగా మారిపోతాడు. జన్యువులలో అసాధారణమైన మార్పుల వల్ల ఈ తరహా వ్యాధి వస్తుంది. ఇది కోట్లల్లో ఒకరికి మాత్రమే వస్తుంది. ఈ వ్యాధి నివారణకు ఉపయోగించే ఇంజక్షన్ ధర అత్యంత ఖరీదుగా ఉంటుంది. అందువల్లే ఆ పాపను బతికించుకోవడానికి తల్లిదండ్రులు ఎక్కని గడపలేదు. కలవని మనిషి లేడు. ఈ విషయం నారా లోకేష్ దృష్టికి రావడంతో.. ఆయన వెంటనే స్పందించారు. తన వంతుగా సహాయం చేశారు. ఫలితంగా ఆ పాపకు ఇంజక్షన్ వేశారు. పునర్వికకు తల్లిదండ్రులు జన్మనిస్తే.. నారా లోకేష్ పునర్జన్మ ప్రసాదించారు.