Nara Lokesh Birthday: నారా లోకేష్( Nara Lokesh).. ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు ఇది. కేవలం రాష్ట్రంలోనే కాదు. జాతీయ స్థాయిలో సైతం ఈ పేరు సుపరిచితంగా మారింది. అయితే ఇది అంత సులువుగా లభించలేదు. ఎన్నెన్నో అవమానాలు, ఎన్నెన్నో హేళనలను తట్టుకొని నిలబడ్డారు లోకేష్. సవాళ్ల నుంచే అవకాశాలు వెతుక్కున్నారు. ప్రత్యర్థులు విసిరిన రాళ్లనే తన విజయానికి పునాదులుగా మార్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకునేలా.. భవిష్యత్తు ఏపీ నాయకుడిగా తన సమర్థతను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు నారా లోకేష్. నేడు ఆయన జన్మదినం. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేష్ కు.
* రాజకీయ శత్రువులు అధికం..
చంద్రబాబు( CM Chandrababu) కుమారుడు కావడం లోకేష్ కు ఉన్న ప్రత్యేకత. కానీ అదే ఆయన పాలిట ప్రతికూలతలు చూపింది. చంద్రబాబు రాజకీయ శత్రువులు లోకేష్ కు శత్రువులయ్యారు. చంద్రబాబును నిందించిన వారు సైతం లోకేష్ ను నిందించారు. కానీ ఎన్నడూ లోకేష్ బాధపడలేదు. తన తండ్రి చెప్పిన మాదిరిగానే సవాళ్ల నుంచి అవకాశాలు వెతుక్కున్నారు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక రాజకీయ వారసుడు ఇంతలా అవమానాలు పొందడం ఇదివరకు ఎన్నడూ చూడలేదు. కానీ వాటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగారు నారా లోకేష్. ఇప్పుడు భారతదేశంలోనే ఒక యువనేతగా గుర్తింపు పొందారు.
* అనేక రకాల ముద్ర..
స్టాన్ ఫోర్ట్( Stanford) యూనివర్సిటీ నుంచి పట్టా పుచ్చుకొని.. ఒక కార్పొరేట్ లుక్ తో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు నారా లోకేష్. కానీ చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులు లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు. ఒక ప్రణాళిక బద్ధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఆయన వేషధారణను చూసి పప్పు అని ముద్రవేశారు. రాజకీయాల్లోకి వస్తారో లేదో తెలియని వయసు నుంచే విష ప్రచారం మొదలుపెట్టారు. కానీ లోకేష్ చాలా సహనంతో భరిస్తూ వచ్చారు. అదే సమయంలో సొంత పార్టీ వారు సైతం ఆయన పై అనేక రకాల సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఆ అవమానాలు ఆయనలో మొండితనాన్ని, పట్టుదలను పెంచాయి.
* పడి లేచిన కెరటంగా..
నవ్విన నాప చేను పండుతుంది అంటారు. అవమానాలు పడిన చోటే పడి లేచి నిలబడ్డారు లోకేష్. ఓడిన చోటే గెలిచారు. పార్టీని గెలిపించే బాధ్యత తీసుకున్నారు. పాదయాత్ర చేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయగలిగారు. ఒకప్పుడు సెటైరికల్ గా మాట్లాడిన వారు లోకేష్ గారు అంటూ సంబోధిస్తున్నారు. ఒకప్పుడు ఆయనపై కామెడీ చేసినవాళ్లు వణికిపోతున్నారు. లోకేష్ రెడ్ బుక్ కు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వారు ఉన్నారు.. తనను ఎగతాళి చేసిన వారంతా అవాక్కయ్యేలా యువ గళం పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాలను షేక్ చేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో క్యాడర్లో ధైర్యం నింపి.. వారికి అండగా నిలబడి.. కేంద్ర పెద్దలతో సమన్వయం చేసుకుంటూ ఒక వ్యూహకర్తగా మారారు.
* యువతకు ఆశా కిరణంగా..
నారా లోకేష్ ఏపీకి మంత్రి మాత్రమే కాదు. యువత భవిష్యత్తుకు ఆశా కిరణంగా మారిపోయారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా.. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలను ఏపీకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దావోస్( davos ) వంటి అంతర్జాతీయ వేదికలపై ఆయన చేస్తున్న విశ్లేషణలు, పెట్టుబడుదారులతో జరుపుతున్న చర్చలు అర్ధవంతంగా ఉంటున్నాయి. మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే.. పార్టీ క్యాడర్ కు ఏ చిన్న ఆపద వచ్చిన నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నారు. అవమానాల పొరలను చీల్చుకుని ఆత్మవిశ్వాసంతో ఎదిగారు లోకేష్. భవిష్యత్ నాయకుడిగా అవతరించారు. అందుకే ప్రధాని మోదీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.