Nara Lokesh: ఏపీలో మంత్రి నారా లోకేష్( Nara Lokesh) జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి ఆపై సీఎం తనయుడు, టిడిపి సుప్రీం కావడంతో ఓ రేంజ్ లో వేడుకలు ఘనంగా జరిపారు అభిమానులు. అయితే కొందరైతే విపరీతమైన అభిమానాన్ని కనబరిచారు. అయితే ఇటువంటి అభిమానమే మాజీ సీఎం జగన్ కొంపలను తీసింది. ఆ విషయం లోకేష్ కు తెలియంది కాదు. అందుకే తన పుట్టినరోజు నాడు అతిగా వ్యవహరించిన కొందరికి చురకలు అంటించారు. మరోసారి ఇటువంటి ఘటనలకు పాల్పడకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా కొందరి వ్యవహార శైలి వల్ల తనకు చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన లోకేష్ వారిపై సీరియస్ అయినంత పని చేశారు.
* పాఠశాల విద్యార్థులతో
లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం( jangareddy gudem ) జడ్పీ హైస్కూల్లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు హ్యాపీ బర్త్డే టూ లోకేష్ సార్ అంటూ గ్రౌండ్ లో కూర్చుని గ్రీటింగ్స్ తెలిపారు. ఆరుబయట ప్రాంగణంలో ఎండలో కూర్చుని విషెస్ తెలపడం కనిపించింది. అయితే కొందరు ఉపాధ్యాయులు ఇలా చేయించారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నారా లోకేష్ స్పందించారు. తన పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్పడంపై.. ధన్యవాదాలు చెబుతూనే.. ఇలాంటి పనులు చేయొద్దంటూ స్కూలు ఉపాధ్యాయులకు చురకలు అంటించారు.
* జగన్ ఇంటి వద్ద హల్చల్
మరోవైపు లోకేష్ జన్మదిన వేడుకలు సొంత నియోజకవర్గ మంగళగిరిలో( Mangalagiri) ఘనంగా జరిగాయి. అయితే ఇదే నియోజకవర్గ పరిధిలో తాడేపల్లి ఉంది. అక్కడ జగన్ ఇంటి వద్ద టిడిపి కార్యకర్తలు హంగామా చేశారు. కార్లతోపాటు బైకుల్లో వచ్చి టిడిపి జెండాలతో హారన్లు మోగించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కూడా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాలని.. టిడిపి కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు.
* సోషల్ మీడియాకు భయపడి
ప్రస్తుతం ఎటువంటి అంశమైనా సోషల్ మీడియాలో( social media) విపరీతంగా ప్రభావం చూపుతోంది. అందున నారా లోకేష్ లాంటి నేత విషయంలో ఏ స్థాయిలో దుష్ప్రచారం చేస్తారో తెలియంది కాదు. అందుకే ఇటువంటి ఆర్భాటాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు లోకేష్. అయితే నిన్న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వేడుకల్లో అక్కడక్కడ కార్యకర్తలు అతిగా వ్యవహరించారు. అందుకే లోకేష్ పరోక్షంగా అందరికీ సంకేతాలు ఇచ్చారు. లేనిపోనివి వద్దు అంటూ వారించారు.