Nara Lokesh: మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) ఎదుగుతున్న తీరు ప్రత్యేకం. ఒక రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చారు లోకేష్. ఈ క్రమంలో ఆయన పై వచ్చిన విమర్శలు, ఇబ్బందులు, అవమానాలు.. వాటన్నింటినీ దాటుకుని ముందుకు సాగారు లోకేష్. దారంతా ముళ్ళు, రాళ్లు దాటుకొని తన రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన తనలో ఉన్న పనితీరును మరింత మెరుగుపరుచుకున్న తీరు అభినందనలు అందుకుంటోంది. చివరికి కోర్టులు సైతం నారా లోకేష్ ను అభినందిస్తున్నాయి అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయనను అభిమానించే వారికి ఇది మంచి వార్త. కానీ రాజకీయ ప్రత్యర్థుల కు మాత్రం మింగుడు పడని విషయం.
* ఎన్నెన్నో అవమానాలు..
అసలు రాజకీయాలకే పనికిరాడు అన్నారు. అబ్బే వేస్ట్ అని వ్యాఖ్యానాలు చేశారు. విమర్శలు చేశారు. ఆయన శరీర ఆకృతిని తక్కువ చేసి మాట్లాడారు. మాటలు రావు శుద్ధ.. అంటూ లేనిపోని కామెంట్స్ చేశారు. బహుశా భారత దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ వారసుడికి లేనంత ఇబ్బందులు లోకేష్ కు ఎదురయ్యాయి. అయితే ఈ రాజకీయాలు ఎందుకులే అని లోకేష్ పక్కకు వెళ్లలేదు. అక్కడే ఉండి అక్కడే తేల్చుకున్నారు. ఎవరైతే అవమానించారో వారితోనే అభినందనలు అందుకున్నారు. రాజకీయాలకు పనికిరాడు అన్నవారే ప్రశంసలు కురిపించేలా తనను తాను మార్చుకున్నాడు నారా లోకేష్. ఎంతలా అంటే ఆయన క్రికెట్ మ్యాచ్ చూసినా ప్రత్యర్థులకు మరోలా కనిపించేలా. ఇక కూటమి ప్రజా ప్రతినిధుల కుటుంబాలతో డిన్నర్ మీటింగులు చేస్తున్నా మింగుడు పడడం లేదు. ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు ఏకంగా నారా లోకేష్ ను ప్రశంసించేసరికి ఏం చేయాలో ప్రత్యర్థులకు పాలుపోవడం లేదు.
* పనితీరుపై అభినందనలు…
ఆంధ్ర ప్రదేశ్( Andhra Pradesh) విద్య, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు నారా లోకేష్. ఆయన పనితీరుపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రశంసించింది. విద్యా శాఖలో ఆయన తీసుకువస్తున్న సంస్కరణలు, సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న చొరవ అభినందనీయమని న్యాయస్థానం పేర్కొంది. కస్తూర్బా పాఠశాలల సిబ్బంది జీతాలు పెంచుతామన్న ప్రకటనను స్వాగతించింది. గతంలో పెండింగ్లో ఉన్న అనేక అంశాలను లోకేష్ బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే కొలిక్కి తీసుకురావడంపై కూడా సానుకూలంగా స్పందించింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. ఎటువంటి వివాదాలు లేకుండా నూతన నియామకాలు, బదిలీలు జరుపుతుండడం పై కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిస్తున్న నిబద్ధతను న్యాయస్థానం కొనియాడింది.