Nandamuri fans: శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాగే టిడిపి( Telugu Desam Party) అనుకూల మీడియా ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఏ రూపంలో మంచి జరగాలనుకుంటే.. ఆ రూపంలోనే కథనాలు ఉంటాయి ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో. అందుకే ఆ సెక్షన్ ఆఫ్ మీడియాకు ఎల్లో మీడియా గా పేరు పెట్టారు. అయితే తాజాగా ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో.. తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ మీడియాలో వచ్చిన కథనం సంచలనంగా మారింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ పై వ్యతిరేక విశ్లేషణాత్మక కథనం దమ్మున్న ఛానల్లో రావడం హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబ హవాను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆ విశ్లేషణాత్మక కథనంపై బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు. పార్టీ కోసం, నందమూరి అనే వాసన కోసం బాలకృష్ణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని.. అటువంటి వ్యక్తిపై ఇలా నిందారోపణ కథనాలు ప్రచురించడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు.
హరికృష్ణ శకం అలా ముగిసింది..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( CM Chandrababu) పాలనాధక్షుడు. రాజకీయ మేధావి. తెలుగుదేశం పార్టీని నడపడంలో విజయవంతం అయ్యారు. అయితే అది నందమూరి కుటుంబం మద్దతుతోనే అన్న విషయాన్ని గ్రహించుకోవాలి. 1994లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కేవలం ఎనిమిది నెలల పాలన సాగించారు. కానీ కుటుంబంలో జరిగిన పరిణామాలు, లక్ష్మీపార్వతి పెత్తనం వంటి కారణాలతో నందమూరి హరికృష్ణ సహాయంతో.. తెలుగుదేశం పార్టీతో పాటు ప్రభుత్వాన్ని దక్కించుకున్నారు చంద్రబాబు. అయితే మంత్రి వర్గంలోకి హరికృష్ణను తీసుకున్నారు. ఆరు నెలల కాలంలో ఆయన చట్ట సభలకు ఎన్నిక కావాల్సి ఉంది. అలా జాప్యం జరగడంతో మంత్రి పదవి కోల్పోయారు. 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా హరికృష్ణకు చాన్స్ దక్కలేదు. తరువాత రాజ్యసభ ఇచ్చారు. కానీ అనుకోని రీతిలో పదవిని వదులుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. అలా హరికృష్ణ శకం ముగిసిపోయింది.
మారిన పరిస్థితులు..
అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna)వరుసగా మూడుసార్లు గెలిచారు. కానీ ఆయన మంత్రి కాలేకపోయారు. అలాగని ఎప్పుడూ తన అసంతృప్తిని బయట పెట్టలేదు. లోకేష్ మంత్రి కావడంతో దీవించారు. తన బావ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో మురిసిపోయారు. అయితే అటువంటి బాలకృష్ణ కోసం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో కథనం రావడం పై నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇటువంటి సంక్లిష్ట సమయంలో నందమూరి అభిమానులు ఏకతాటి పైకి వచ్చినట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ రూపంలో నందమూరి అభిమానుల్లో చీలిక ఉండేది. మొన్నటికి మొన్న అనంతపురం టిడిపి ఎమ్మెల్యే వ్యాఖ్యలు పెను వివాదానికి దారి తీసాయి. తాజాగా శాసనసభలో బాలకృష్ణ వ్యాఖ్యలపై కూడా వివాదం జరిగింది. ఈ పరిణామాల క్రమంలో అనుకూల మీడియాలో వ్యతిరేక కథనం వచ్చింది. దీంతో నందమూరి అభిమానుల్లో ఇది ఐక్యతకు కారణం అయింది. ఈ విషయంలో బాబాయ్ కి అబ్బాయి దగ్గరయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ముందుగా అభిమానులు ఏకతాటి పైకి వచ్చి.. మున్ముందు ఇలాంటి పరిణామాలు జరగకుండా ఐక్యత చాటాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాలి.