Homeఆంధ్రప్రదేశ్‌Nandamuri Family Politics: తెలంగాణలో టిడిపి.. జూబ్లీహిల్స్ బై పోల్ లో నందమూరి వారసురాలు!

Nandamuri Family Politics: తెలంగాణలో టిడిపి.. జూబ్లీహిల్స్ బై పోల్ లో నందమూరి వారసురాలు!

Nandamuri Family Politics: తెలుగు రాజకీయాల్లో నందమూరి కుటుంబానికి ( Nandamuri family) ప్రత్యేక స్థానం. ఎన్టీఆర్ వారసులుగా నందమూరి హరికృష్ణతో పాటు బాలకృష్ణ రాజకీయం చేశారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు టిడిపిలో క్రియాశీలకంగా అవుతామనుకున్న తరుణంలో నందమూరి తారకరత్న మృతి చెందారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ వారి సోదరి సుహాసిని మాత్రం యాక్టివ్ గా ఉన్నారు. తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. బిఆర్ఎస్ ఎమ్మెల్యే కావడంతో ఆ పార్టీ సెంటిమెంట్ వస్త్రాలను బయటకు తీస్తోంది. మరోవైపు కంటోన్మెంట్ తరహాలోనే ఈ సీట్లో పాగా వేయాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.

టిడిపికి అనుకొని అవకాశం..
అనుకోని అవకాశంగా తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) భావిస్తోంది. వాస్తవానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీకి చెందినవారు. టిడిపి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. అందుకే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టిడిపికి మిత్రపక్షాలుగా ఉన్న బిజెపి, జనసేనతో తెలుగుదేశం పార్టీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ అభ్యర్థిత్వంపై ఒక అంచనాకు వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ స్థానానికి అక్టోబర్లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సెప్టెంబర్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

గట్టి ప్రయత్నంలో కాంగ్రెస్..
అధికార కాంగ్రెస్ పార్టీ( Congress Party) ఈ విషయంలో ముందుంది. ఎలాగైనా ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. నియోజకవర్గంలో పరిస్థితుల అధ్యయనం, నిర్ణయాల కోసం పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ తో కూడిన కమిటీని సీఎం రేవంత్ ఏర్పాటు చేశారు. 2009 పునర్విభజనతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడింది. 2014 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు మాగంటి గోపీనాథ్. 2014లో టిడిపి నుంచి, 2018, 2023 ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఖైరతాబాద్ నుంచి విడిపోయి జూబ్లీహిల్స్ నియోజకవర్గం గా అవతరించింది. 2009లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు.

Also Read:  Nandamuri Balakrishna: ఆ పూజారి కారణంగా బాలయ్య జీవితం రివర్స్ అయ్యిందా? వెలుగులోకి వచ్చిన నిజాలు!

కాంగ్రెస్ నుంచి ప్రముఖంగా వారే
ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ( Congress Party) నుంచి అజారుద్దీన్, పిజిఆర్ కుమార్తె విజయా రెడ్డి, నవీన్ యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓటింగ్ కీలకం. కాంగ్రెస్ ఎంఐఎం మధ్య ఒప్పందం కుదిరితే మాత్రం ఇక్కడ సమీకరణలు మారడం ఖాయం. మరోవైపు గోపీనాథ్ కుటుంబం నుంచే బిఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది. సాధ్యం కాకుంటే మాత్రం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి సీటు కేటాయించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం మిగతా రెండు మిత్రపక్షాలతో కలిపి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అటు మాగంటి గోపీనాథ్ చంద్రబాబుకు కావలసిన మనిషి. అందుకే ఆయన మరణ సమయంలో లోకేష్ ప్రత్యేకంగా పరామర్శించారు వారి కుటుంబ సభ్యులను.

సామాజిక సమీకరణల దృష్ట్యా
తెలంగాణలో టిడిపి విస్తరణ దిశగా చంద్రబాబు ( Chandrababu)ప్లాన్ చేస్తున్నారు. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో అవకాశం వచ్చింది. టిడిపి, బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్థిని రంగంలో దించే పరిస్థితి కనిపిస్తోంది. టిడిపి నుంచి నందమూరి సుహాసిని బరిలోకి దించితే మంచి ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కమ్మ ప్రాబల్యం అధికం. సామాజిక సమీకరణల దృష్ట్యా సుహాసిని అభ్యర్థిత్వం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version