Chiranjeevi and Nagababu: మెగా బ్రదర్ నాగబాబు( Mega brother Naga babu ) ఎందుకు మౌనంగా ఉన్నారు? రాజకీయ ప్రకటనలు చేయడం లేదు ఎందుకు? సోషల్ మీడియాలో కూడా ఎందుకు యాక్టివ్ గా లేరు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం కూటమిలో ఎమ్మెల్సీగా ఉన్నారు నాగబాబు. మొన్ననే జనసేన తరఫున ఎమ్మెల్సీ అయ్యారు. త్వరలో క్యాబినెట్లోకి తీసుకుంటారని కూడా ప్రచారం సాగింది. కానీ అందులో జాప్యం జరుగుతోంది. మరోవైపు ఇటీవల శాసనమండలి తొలి సమావేశాలకు హాజరయ్యారు. అక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. పిఠాపురం నియోజకవర్గం వైపు కూడా వెళ్లడం లేదు. మరోవైపు నాగబాబు స్థానంలో మరొకరిని జనసేన ప్రధాన కార్యదర్శిగా తెచ్చారు. ఆయన కార్యకలాపాలు చూస్తున్నారు. దీంతో నాగబాబు సైలెంట్ కావడం రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది.
రాజ్యసభ పై దృష్టి..
వాస్తవానికి ఎమ్మెల్సీ పదవిలో నాగబాబు ఏమంత కంఫర్ట్ గా లేరు. ఆపై మంత్రిగా కంటే రాజ్యసభకు ( Rajya Sabha )వెళ్లి పెద్దల సభలో అడుగు పెట్టాలన్నది నాగబాబు లక్ష్యం. అయితే రాజ్యసభ పదవుల సర్దుబాటులో భాగంగా నాగబాబుకు చాన్స్ రాలేదు. ఆయనను సంతృప్తి పరిచేందుకు సీఎం చంద్రబాబు త్వరలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. అలా ప్రకటించిన చాలా రోజుల తరువాత ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. అయితే అదిగో మంత్రి పదవి.. ఇదిగో మంత్రి పదవి అంటూ ప్రచారం సాగుతోంది. కానీ నాగబాబుకు మంత్రిగా ఛాన్స్ దక్కలేదు. క్యాబినెట్ లో ఉన్న ఒకే ఒక పదవి నాగబాబు కోసమే ఖాళీగా ఉంచాలని చాలా రోజులుగా ప్రచారం సాగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. కనీసం కూటమి ప్రభుత్వం రెండేళ్లు పదవి పూర్తి చేసుకున్న తర్వాతే విస్తరణ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అప్పటివరకు నాగబాబు ఎమ్మెల్సీ గానే ఉంటారని తెలుస్తోంది. అయితే మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే ఆయన మౌనంగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సోదరుడితో భేటీ..
అయితే మెగా బ్రదర్ నాగబాబు మెగా అభిమానులకు అండగా నిలుస్తారు. అభిమాన సంఘాలను సమన్వయం చేసుకుంటూ వస్తారు. మొన్న ఆ మధ్యన అసెంబ్లీలో బాలకృష్ణ ( Nandamuri Balakrishna)చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ అభిమానులు మనస్థాపానికి గురైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణపై విరుచుకుపడుతూ ఉంటారు. అయితే ఆ మధ్యన చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మెగా అభిమానులు సమావేశం అయ్యారు. కచ్చితంగా ఈ సమావేశం వెనుక నాగబాబు హస్తం ఉంటుంది. కానీ నాగబాబు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. సాధారణంగా చిరంజీవి పై ఎవరైనా విమర్శలు చేస్తే సహించరు. అటువంటిది ఆ సమావేశానికి వెళ్లలేదు. అయితే విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న చిరంజీవి తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు నాగబాబు. కూటమి ప్రభుత్వంలో జనసేన ఉన్నందున ఇక్కడితో ఈ అంశాన్ని విడిచి పెట్టాలని చిరంజీవి సూచించినట్లు ప్రచారం సాగుతోంది. అందుకే నాగబాబు క్రియాశీలకంగా లేనట్లు తెలుస్తోంది.