Nagababu Wife : పిఠాపురం నియోజకవర్గం మెగా కుటుంబాన్ని ఎంతో ఆదరించింది. ఆ నియోజకవర్గంలో మెగా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం కూడా ఏర్పడింది. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ కు ఘన విజయం అందించారు. ఈ రాష్ట్రానికి ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యేందుకు దోహదపడ్డారు. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బరిలో నిలిచారు. కానీ రెండు చోట్ల ఓడిపోయారు. అందుకే ఈసారి అనూహ్యంగా పిఠాపురం నుంచి బరిలో దిగారు. దాదాపు 70 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే పవన్ ను ఓడించాలని నాటి అధికార వైసిపి చాలా రకాలుగా ప్రయత్నించింది. పెద్ద ఎత్తున ప్రలోభాలకు దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయినా సరే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు.. ఎటువంటి ప్రలోభాలకు చిక్కలేదు. ఏకపక్షంగా పవన్ కు మద్దతు తెలిపారు. భారీ విజయాన్ని కట్టబెట్టారు. అందుకే మెగా కుటుంబం పిఠాపురం పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటోంది. పండుగలు పర్వదినాలను ఇక్కడే జరుపుకోవాలని భావిస్తోంది. తాజాగా ఈరోజు శ్రావణ శుక్రవారం పూజలు పిఠాపురం లోనే జరుపుకున్నారు నాగబాబు భార్య. ఈ సందర్భంగా నియోజకవర్గ ఆడపడుచులకు 12,000 చీరలను పంపిణీ చేశారు. మహిళా లోకం పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
* పవన్ కు అండగా కుటుంబం
ఈ ఎన్నికల్లో మెగా కుటుంబం పవన్ కు అండగా నిలిచింది. పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులతో పాటు కూటమికి అండగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. పిఠాపురంలో మాత్రం మెగా కుటుంబం ప్రచారం చేసింది. నాగబాబు,ఆయన భార్య, కుమారుడు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ప్రచారంలో పాల్గొన్నారు. రామ్ చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ, అల్లు అరవింద్ నేరుగా పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు.
* భూముల ధరలకు రెక్కలు
పిఠాపురంలో పవన్ గెలిచాక చాలా రకాల మార్పులు వచ్చాయి. పవన్ సైతం స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధపడ్డారు. ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరిగాయి. జన సైనికులు, సినీ రంగానికి చెందిన వారు సైతం అక్కడ భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. దీంతో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయని స్థానికులు చెబుతున్నారు.
* సినిమా ఈవెంట్లు కూడా ఇక్కడే
మరోవైపు మెగా కుటుంబానికి చెందిన వ్యక్తుల సినిమా ఈవెంట్లను పిఠాపురంలో జరిపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అపోలో ఆసుపత్రి నిర్మాణానికి రామ్ చరణ్ సతీమణి ఉపాసన స్థలం సేకరించినట్లు సమాచారం. అపోలో ఆసుపత్రుల ప్రతినిధిగా ఆమె ఉన్నారు. పవన్ పిఠాపురం నుంచి గెలిచిన నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో తేవాలన్న లక్ష్యంతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు నాగబాబు భార్య శ్రావణ లక్ష్మి పూజలు సైతం పిఠాపురంలోనే జరుపుకున్నారు. మహిళలకు 12,000 చీరలను పంపిణీ చేశారు. మెగా కుటుంబం ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఫిదా అవుతున్నారు.