Naga babu : మెగా బ్రదర్ నాగబాబు( Nagababu ) మంత్రి పదవి చేపట్టబోయే కాలం మరి ఎంతో దూరంలో లేదు. మార్చి నెల చివర్లో ఆయన అమాత్యుడిగా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం నడుస్తోంది. కొద్ది రోజుల కిందట మంత్రి వర్గంలోకి నాగబాబును తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రకటన వచ్చి నెలలు గడుస్తున్న కార్యరూపం దాల్చలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరిగింది. నాగబాబు విజయవాడ వస్తే చాలు మంత్రి పదవి కోసమేనని అంతా టాక్ నడిచింది. అయితే ఉగాది నాటికి నాగబాబు మంత్రి కావడం ఖాయం అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 20న పోలింగ్ జరగనుంది.
* ఐదు స్థానాలు కూటమివే
ఏపీలో ( Andhra Pradesh) కూటమికి ఏకపక్ష బలం ఉంది. 175 అసెంబ్లీ సీట్లకు గాను 164 చోట్ల కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు 11 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ పదవులన్నీ కూటమి కైవసం చేసుకుంటుంది. ఇప్పుడు కూడా ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కూటమి పార్టీలే కైవసం చేసుకుంటాయి. ఐదు పదవులకు గాను ఏ పార్టీకి ఎన్ని కేటాయిస్తారో ఇంకా స్పష్టత రాలేదు. కానీ అందులో మెగా బ్రదర్ నాగబాబు కు ఒక పదవి ఖాయం అయ్యింది. ఆయన ఇలా ఎమ్మెల్సీగా ఎన్నికై.. అలా మంత్రి పదవి చేపడతారని ప్రచారం జరుగుతోంది.
* జనసేనలో చాలా యాక్టివ్
ప్రస్తుతం నాగబాబు జనసేన( janasena ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నిన్నటి ఎన్నికల్లో చాలా యాక్టివ్ గా పని చేశారు. వాస్తవానికి ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయన ఆ పార్లమెంట్ స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అయితే చివరి నిమిషంలో ఆ స్థానం పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించారు. దీంతో నాగబాబు డ్రాప్ కావాల్సి వచ్చింది. అయితే కూటమి తరుపున గట్టిగానే ప్రచారం చేశారు. సమన్వయం చేసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యసభ పదవి ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ మారిన సమీకరణలో భాగంగా ఆయనకు చాన్స్ దక్కలేదు.
* ఉగాది సెంటిమెంట్ తో
అయితే కొద్ది నెలల కిందట సీఎం చంద్రబాబు( CM Chandrababu) నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ కనిపిస్తోంది. సాధారణంగా తెలుగు వారికి సెంటిమెంట్ ఎక్కువ. 20న ఎన్నిక జరుగుతుంది. 30న ఉగాది పర్వదినం. ఆరోజు మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. అయితే అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.