Mudragada Padmanabham: రాజకీయాలు మొదలు పెట్టేసిన ముద్రగడ.. పవనే టార్గెట్

ముద్రగడ ఒక రాజకీయ నేత కంటే కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడిగానే సుపరిచితం. 2009 తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని అందుకున్నారు.

Written By: Dharma, Updated On : March 16, 2024 12:58 pm

Mudragada Padmanabham

Follow us on

Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం దూకుడు పెంచారు. రాజకీయాలు మొదలుపెట్టారు. రాజకీయ వ్యాఖ్యానాలు కూడా చేయడం ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకున్నారు. వ్యక్తిగత కామెంట్లకు సైతం సిద్ధమని సంకేతాలు పంపారు. తాను వైసిపి వ్యవస్థాపక సభ్యుడినని అర్థం వచ్చేలా మాట్లాడారు. మరోసారి సీఎం పీఠంపై జగన్ కూర్చోబెడతానని కూడా తేల్చి చెప్పారు.నిన్ననే ఆయన వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

ముద్రగడ ఒక రాజకీయ నేత కంటే కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడిగానే సుపరిచితం. 2009 తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని అందుకున్నారు. వైసీపీకి ప్రయోజనం చేకూర్చారన్న ఆరోపణలు నాడు ఎదుర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమాన్ని నిలిపివేశారు. గత నాలుగు సంవత్సరాలుగా వైసీపీలో చేరతారని భావించారు. కానీ ఇప్పుడు ముసుగు తీశారు. వైసీపీలో చేరిపోయారు. వైసిపి నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం ప్రారంభించారు.పవన్ తో పాటు చంద్రబాబును టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.

నిన్ననే జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. దీని వెనుక జనసేన సోషల్ మీడియా ఉందని అనుమానిస్తున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి రాజకీయంగా ఎంతో చరిత్ర ఉందని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదన్నారు. ఎటువంటి షరతులు లేకుండా తాను వైసీపీలో చేరినట్లు ప్రకటించారు. ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే తాను వైసీపీని వేదికగా ఎంచుకున్నట్లు చెప్పుకొచ్చారు. తాను దళితుల బిక్షతోనే ఈ స్థాయికి వచ్చానని.. బీసీలు,దళితులు ముందుండి నడిపించారని వివరించారు. తన వర్గాన్ని, తన మనుషులను కాపాడుకోవడానికి ఏం చేసేందుకైనా సిద్ధమని స్పష్టం చేశారు.

పవన్ సినిమాల్లో హీరో అయితే తను రాజకీయాల్లో హీరోనంటూ కామెంట్స్ చేశారు ముద్రగడ. ఏపీ ప్రజలు సినిమా వారిని నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. అలా ఒక్క ఎన్టీఆర్ను మాత్రమే ప్రజలు నమ్మారని గుర్తు చేశారు. కాపు జాతిని చంద్రబాబు అవమానించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. తనకుచెప్పడానికి పవన్ ఎవరని నిలదీశారు. అసలు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పవన్ ఎక్కడికి వెళ్లారని కూడా ప్రశ్నించారు. కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో మొలతాడు లేని వాడు అంటూ పవన్ పై అనుచిత కామెంట్స్ చేశారు.కొన్ని శక్తులు సీఎం జగన్ తనకు దూరం చేశాయని.. వాస్తవానికి వైసీపీలో వ్యవస్థాపక సభ్యుడిని నర్మ గర్భంగా ముద్రగడ వ్యాఖ్యలు చేయడం విశేషం.