Mudragada Kapu leaders : ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేపటికి కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. గత ఏడాది జూన్ 4న ఫలితాలు వచ్చాయి. కూటమి ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఈ ఏడాది కాలంలో అమలు చేయలేదని చెబుతూ.. జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహించాలని వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అయితే అదే రోజున దీపావళి, సంక్రాంతి కలిపి జరుపుకోవాలని జనసేన నాయకత్వం సూచించింది. దీంతో ఏపీలో రేపు పొలిటికల్ హైటెన్షన్ తప్పదు. మరోవైపు కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం, ఇతర కాపు నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తుని రైలు దగ్ధం ఘటనకు సంబంధించిన తీర్పుపై.. అప్పిల్ కు వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ముద్రగడ పద్మనాభం తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కాపు నేతలు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
* 2017లో రైలు దహనం కేసు..
ముద్రగడ పద్మనాభం( mudragada Padmanabham ) కాపు రిజర్వేషన్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ వచ్చారు. ఆయన రాజకీయ నాయకుడిగా కంటే కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే గుర్తింపు పొందారు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. ఈ తరుణంలో కాపు రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో 2017లో తునిలో రైలు దహనం అయింది. అప్పట్లో ముద్రగడ పద్మనాభం తో పాటు చాలామంది కాపు నేతలపై కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఘటన తో టిడిపి ప్రభుత్వం పై కాపులు వ్యతిరేకత పెంచుకున్నారు. అది సహజంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చింది. అయితే ఈ ఘటన వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అల్లరిమూకలు ఉన్నాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కాపులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించేందుకు ఇలా చేశారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఘటన తరువాత కాపులకు ఈ బీసీ రిజర్వేషన్లు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
Also Read : అక్కడ ముద్రగడకు అంత సులువు కాదు!
* ఉన్న రిజర్వేషన్లు నిలిపివేత..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధికారంలోకి వచ్చిన తరువాత కాపులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని.. ఈ బీసీ రిజర్వేషన్లు కొనసాగిస్తారని అంతా భావించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ రిజర్వేషన్లను సైతం నిలిపివేశారు. అయినా సరే ముద్రగడ పద్మనాభం లాంటి నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ప్రకటించారు. అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిత్యం అభినందిస్తూ ముద్రగడ లేఖలు రాస్తుండేవారు. అదే సమయంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లు పద్మనాభం ప్రకటించారు. దీంతో ఆయనపై అనుమానాలు పెరిగిపోయాయి. అదే సమయంలో తుని రైలు దగ్ధం కేసులో ముద్రగడతోపాటు ఉద్యమ నాయకులపై కేసులు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఈ కేసులన్నీ ఎత్తి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
* టిడిపి కూటమికి వ్యతిరేకంగా..
అయితే 2024 ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం టిడిపి కూటమికి( TDP Alliance ) వ్యతిరేకంగా పనిచేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. అందుకే ఇప్పుడు తుని రైలు దగ్ధం కేసులో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. పై కోర్టులో ఆప్పీల్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ముద్రగడతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిన కాపు నేతల చుట్టూ బిగుసుకున్నట్లు అయ్యింది.