MS Dhoni Amaravati: అమరావతి రాజధానిని( Amravati capital ) అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని భావిస్తున్నారు చంద్రబాబు. ఒక్క రాజధాని అన్న భావన లేకుండా.. పర్యాటకంగా, క్రీడల పరంగా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. సాధారణంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు.. కేవలం పనుల మీద వెళ్లిన వారు తక్కువ. పర్యాటక ప్రాంతాలను చూడాలని, క్రీడా పరమైన పోటీలను చూడాలని వెళ్లేవారు ఉండేవారు. అటువంటి పరిస్థితి అమరావతి రాజధానికి కూడా తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు. అమరావతిలో అంతర్జాతీయ క్రీడా మైదానం నిర్మించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రపంచంలో మేటి భారత క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోవాలని చూస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇండియన్ మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రాజధాని ప్రాంతంలో రెండు రోజులు పర్యటించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం చంద్రబాబుతో ప్రత్యేక భేటీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
* అంతర్జాతీయ స్పోర్ట్స్ విలేజ్..
అమరావతిలో నవ నగరాలు నిర్మించాలి అన్నది చంద్రబాబు( CM Chandrababu) ప్రణాళిక. అయితే అదనంగా కొన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు భూ సమీకరణ చేయాలని ఖాజాగా నిర్ణయించుకుంది ఏపీ ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ విలేజ్ నిర్మించాలన్నది ప్రధాన ఆలోచన. అందులో భాగంగా అతిపెద్ద స్టేడియం తో పాటు క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అయితే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలో క్రికెట్ అకాడమీని ప్రారంభిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాజీ కెప్టెన్ ధోని సంప్రదించి అమరావతి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. మహేంద్రసింగ్ ధోనీని క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరి అవకాశం ఉంది. రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని చంద్రబాబు కోరనున్నట్లు సమాచారం.
* ఏపీ ప్రభుత్వ అంబాసిడర్ గా..
గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వం క్రీడా రంగానికి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం క్రీడాకారుల విషయంలో చాలా సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా తో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు. ఆయన ప్రోత్సాహంతోనే ఏపీలో క్రికెట్ అభివృద్ధికి ప్రణాళిక వేస్తోంది కూటమి ప్రభుత్వం. మొన్న ఐసీసీ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు విశాఖలో ప్రారంభమయ్యాయి. ఏపీ ప్రభుత్వం తరఫున ఆతిథ్య మ్యాచ్ ఘనంగా జరిగింది. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు జై షా కూడా విచ్చేశారు. ముంబైలో ఫైనల్ మ్యాచ్ ను జై షా తో కలిసి తిలకించారు లోకేష్. అయితే ఇప్పుడు మహేంద్రసింగ్ ధోని అమరావతిలో పర్యటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా ధోనిని ప్రకటించే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ ను ప్రోత్సహించి అకాడమీ ప్రారంభించేలా చేసారు చంద్రబాబు. అటు తరువాత ఒలింపిక్స్ విజేత పీవీ సింధును కూడా ప్రభుత్వం ప్రోత్సహించి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.. ఇప్పుడు ధోనీతో మరో ప్రయత్నం చేయబోతున్నట్లు తెలుస్తోంది.