https://oktelugu.com/

Modi – Chandrababu – Pawan : చంద్రబాబు, పవన్ లకు మోడీ పిలుపు

అయితే ఇప్పటివరకూ బీజేపీ కోసం వెంపర్లాడిన చంద్రబాబు ఇటీవల తగ్గారు. ఇప్పుడు ఆహ్వానం అందితే ఎలా స్పందిస్తారో అన్నది చూడాలి. అటు పవన్ సైతం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది.

Written By:
  • Dharma
  • , Updated On : July 7, 2023 8:45 am
    Follow us on

    Modi – Chandrababu – Pawan : బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. మూడోసారి అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. బీజేపీలో సమూల మార్పులతో పాటు దూరమైన వర్గాలను దరి చేర్చుకునే పనిలో పడింది. దేశ వ్యాప్తంగా పార్టీలో భారీ ప్రక్షాళనకు దిగింది. నాలుగు రాష్ట్రాల నాయకత్వాలను మార్చింది. మరో ఆరు రాష్ట్రాల్లో సైతం మార్పులు చేయాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ గట్టెక్కడం ఏమంత సులువు కాదని సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ప్రధాని మోదీ, షా ద్వయం పునరాలోచనలో పడింది. పూర్వమిత్రులను చేరదీయ్యాలని నిర్ణయించారు.

    గతంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చాలా పార్టీలు పనిచేశాయి. శివసేన, టీడీపీ, శిరోమణి అకాలీదళ్, జేడీయూ వంటి పార్టీలు నమ్మదగిన మిత్రులుగా ఉండేవారు. కానీ దేశ వ్యాప్తంగా బీజేపీ విస్తరణలో భాగంగా ప్రాంతీయ పార్టీలను కబళించిందన్న అపవాదు ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య పార్టీలను దెబ్బతీసినట్టు ఆరోపణలున్నాయి. అందుకే ఎన్డీఏలో ఒకటి రెండు చిన్నా చితకా పార్టీలు మినహా.. ప్రధాన రాజకీయ పార్టీలు దూరమయ్యాయి. ఇప్పుడు విపక్ష కూటమి పురుడుబోసుకోవడం, కాంగ్రెస్ బలపడినట్టు సంకేతాలు వస్తుండడంతో మోదీ, షా ద్వయం పునరాలోచనలో పడింది. అందుకే పాత మిత్రులను చేరదీయ్యాలని నిర్ణయించింది.

    ఈ నెల 18న పాతమిత్రులు, భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఇప్పటికే అన్ని పార్టీలకు ఆహ్వానం అందించినట్టు తెలుస్తోంది. ఏపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీతో పాటు జనసేనను ఆహ్వానించినట్టు సమాచారం. అయితే అటువంటి సమాచారం ఏదీ లేదని టీడీపీ చెబుతోంది. జనసేన విషయంలో క్లారిటీ లేదు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ ఈ నిర్ణయానికి వచ్చింది. కానీ ఏపీలో టీడీపీ, జనసేనతో పాటు వైసీపీతో బీజేపీ స్నేహం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆహ్వానం అందితే టీడీపీ, జనసేనలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

    ప్రస్తుతం ఎన్డీఏలో బీజేపీ, శివసేన (ఏకనాథ్‌ షిండే వర్గం), రాష్ట్రీయ లోక్‌ జనశక్తి (చిరాగ్‌ పశ్వాన్‌ వర్గం), అన్నాడీఎంకే, అప్నాదళ్‌ (సోనెలాల్‌ ), నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (మేఘాలయ), నేషనల్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (నాగాలాండ్‌), ఆల్‌ జార్ఘండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పార్టీ (జార్ఖండ్‌) తో పాటు పలు చిన్నా చితక పార్టీలున్నాయి. ఇటీవల బిహార్‌లో జితన్‌ రాం మాంఝీకి చెందిన హిందూస్థాన్‌ ఆవాం మోర్చా ఎన్డీయేలో చేరింది. జేడీఎస్ అధినేత కుమారస్వామి సైతం ఇటీవల ప్రధాని మోదీని కలిశారు. దీంతో జేడీఎస్ ఎన్డీఏలో చేరిక లాంఛనమే.

    కర్నాటక ఎన్నికల తరువాత బీజేపీ స్వరంలో మార్పు వచ్చింది. తెలంగాణలో గట్టెక్కడం అంత సులువు కాదని భావిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ గెలవకూడదన్నది బీజేపీ అభిమతం. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో కాంగ్రెస్ సత్తా చాటితే మాత్రం ఆ పార్టీ ప్రభ పెరిగే అవకాశముందని బీజేపీ అంచనా వేస్తోంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పాత మిత్రులను చేరదీసేందుకు డిసైడయ్యింది. అయితే ఇప్పటివరకూ బీజేపీ కోసం వెంపర్లాడిన చంద్రబాబు ఇటీవల తగ్గారు. ఇప్పుడు ఆహ్వానం అందితే ఎలా స్పందిస్తారో అన్నది చూడాలి. అటు పవన్ సైతం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది.