Marri Rajashekar: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి మరో షాక్. ఆ పార్టీ ఎమ్మెల్సీ ఒకరు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. గత కొద్దిరోజులుగా వైసీపీ నేతల చేరికలు లేవు. మళ్లీ ఇప్పుడు ప్రారంభం కావడం విశేషం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. కేవలం ఆ పార్టీ 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో ఆందోళనకు గురయ్యారు. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదని భావించి కూటమి పార్టీల్లో చేరారు. చాలామంది రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం పార్టీని వీడారు. అయితే గత కొంతకాలంగా ఈ చేరికలకు బ్రేక్ పడింది. కానీ ఇప్పుడు మరో ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఆయనే ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. ఈరోజు సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
* వైసిపి ఆవిర్భావం నుంచి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తూ వచ్చారు మర్రి రాజశేఖర్( Rajasekhar ). జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లారు. అయితే 2004 లోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. 2009లో మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2010లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ప్రతి పార్టీ పుల్లారావు చేతిలో ఓడిపోయారు. అనంతరం ఉమ్మడి గుంటూరు వైసిపి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2018లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ముఖ్యపాత్ర పోషించారు. 2019లో మాత్రం చిలకలూరిపేట టిక్కెట్టును విడదల రజినీకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ అధికారంలోకి వస్తే సరైన పదవి ఇస్తానని.. ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో రజిని గెలుపు కోసం కృషి చేశారు మర్రి రాజశేఖర్.
* ఎటువంటి గుర్తింపు లేకపోవడంతో..
వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సీన్ మారింది. మర్రి రాజశేఖర్ కు ఎటువంటి గుర్తింపు దక్కలేదు. ఎమ్మెల్యేగా గెలిచిన రజనీకి మాత్రం విస్తరణలో మంత్రి పదవి ఇచ్చారు. దీనిపై రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో 2023 మార్చిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు. అప్పటినుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. అందుకే ఈరోజు సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి రాజశేఖర్ ఈ ఏడాది మార్చి 19న వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి సానుకూలత రాకపోవడంతో వేచి చూశారు. ఇప్పుడు చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఆయన సమక్షంలోనే టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు.