MLC Duvvada Srinivasa Rao : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కథానాయకుడిగా మారాడు. దువ్వాడలో హీరో క్వాలిటీస్ ఉన్నాయని ఆయన సన్నిహితురాలు దివ్యల మాధురి ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఆయనతో సినిమా తీస్తానని కూడా ప్రకటించారు. అయితే ఆమె తీశారో లేదో తెలియదు గానీ.. నిర్మాత మధురాజ్ పేరిట దువ్వాడ హీరోగా వాలంటీర్ అనే సినిమా రూపొందింది. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది. కానీ నేరుగా థియేటర్లలో కాదు. అలాగని ఓటిటిలో కూడా కనిపించదు. యూట్యూబ్ లో మాత్రమే ఉంటుంది. వాలంటీర్ అనే టైటిల్ ఈ సినిమాకు పెట్టారు. కానీ వాలంటీర్ గా దువ్వాడ శ్రీనివాస్ కనిపించలేదు. వాలంటీర్ పాత్రను వేరే కుర్రోడు పోషించాడు. ఆయన నిత్యం శీనన్న శీనన్న అంటూ కలవరిస్తుంటాడు. ఆ శీనన్న పాత్రలోనే దువ్వాడ శ్రీనివాస్ కనిపించారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పాత్రలో ఆయన కనిపిస్తారు. ఉద్యమాలు చేసి జగనన్న ప్రభుత్వం రావాలని కలలుకని.. ఆ కలను నిజం చేసే శీనన్న అనే వీరుడి కథఇది. అయితే ట్విస్ట్ ఏమిటంటే.. వైసీపీ అధికారంలో ఉండగా ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. వైసిపి ఓడిపోయిన తర్వాత రిలీజ్ చేశారు.
* టెక్కలి లోనే షూటింగ్
అయితే ఈ సినిమా ఎప్పుడు చిత్రీకరించారో తెలియదు. కానీ దువ్వాడ శ్రీనివాస్ స్వస్థలం టెక్కలి లోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే ఈ సినిమాలో శీనన్న పాత్రధారి కుటుంబ విలువల గురించి, భార్య గొప్పతనం గురించి చెబుతాడు. పైగా దాన కర్ణుడు. ఆయన శాసిస్తే చాలు కుటుంబ సభ్యులు నోట్ల కట్లను దానం చేస్తుంటారు. అయితే ఇంతలా భార్య గురించి చెప్పిన దువ్వాడ శ్రీనివాస్.. నిజజీవితంలో మాత్రం అదే భార్యను ద్వేషించారు. ఆమె ఉండగానే మరో మహిళతో సంబంధం కొనసాగించారు. ఆమెకే టాప్ ప్రయారిటీ ఇచ్చారు.
* వైసిపి ఉద్యమకారుడుగా
ఈ సినిమాలో దువ్వాడ శ్రీనివాస్ ఒక ఉద్యమకారుడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాడు. ఈ క్రమంలో ఆయన పై దాడి జరుగుతుంది. అతని భార్యను చంపేస్తారు. తీవ్ర కత్తిపోట్లతో శీనన్న గాయపడతాడు. కానీ కోలుకుంటాడు. జగనన్నకి సపోర్ట్ గా నిలుస్తాడు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పుడే ఒక ప్రతిపక్ష నేతకు వ్యతిరేకంగా శీనన్న గలమేత్తుతాడు. ఈ క్రమంలో జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల చిట్టా చదువుతాడు. అప్పుడు ప్రతిపక్ష నేత సైతం జగనన్నకు జై కొడతాడు. దీంతో సినిమాకు ఎండ్ కార్డు పడుతుంది.
* బ్రహ్మానందంను జ్ఞాపకం తెచ్చేలా
ఆ మధ్యన అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం ను సైతం దర్శకుడు ఇదే మాదిరిగా చూపిస్తాడు. హాలీవుడ్ రేంజ్ లో ఓ సినిమాను రూపొందిస్తాడు బ్రహ్మానందం. ఈ చిత్రంలో దర్శకుడు ఆయనే, నిర్మాత ఆయనే,హీరో ఆయనే,చివరికి హీరోయిన్ కూడా ఆయనే. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసును బ్రహ్మానందంతో పోల్చుతున్నారు. మొత్తానికైతే దువ్వాడ శ్రీనివాస్ లో హీరో లక్షణాలు ఉన్నాయని చెప్పిన దివ్వెల మాధురి తెర వెనుక ఉండి అనంతపని చేశారన్నమాట.